విన్నర్​ వకీల్​సాబ్​.. రిపోర్టర్ నుంచి ఎమ్మెల్యే వరకు

విన్నర్​ వకీల్​సాబ్​.. రిపోర్టర్ నుంచి ఎమ్మెల్యే వరకు

దుబ్బాక, వెలుగు: జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో అవమానాలు.. ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయినా ఎక్కడా అధైర్య పడలేదు.. ఓటములనే ఒక్కొక్క మెట్టుగా మలుచుకుంటూ ముందుకు వెళ్లారు మాధవనేని రఘునందన్​రావు. బీజేపీ క్యాండిడేట్​గా దుబ్బాక బై ఎలక్షన్​లో  గెలిచి సత్తా చాటారు. 

రిపోర్టర్​గా కెరీర్​ మొదలు పెట్టి..

రఘునందన్​రావు 1968లో భగవంతరావు, భారతి దంపతులకు సిద్దిపేటలో జన్మించారు. డిగ్రీ వరకు సిద్దిపేటలోనే చదువుకున్న ఆయన రిపోర్టర్​గా తన కెరీర్​ మొదలుపెట్టారు. జర్నలిస్టుగా కొనసాగుతున్న టైంలోనే వివిధ రాజకీయ, సామాజిక అంశాలపై పట్టు సాధించారు. ఈ క్రమంలోనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్​ఎల్​బీ కంప్లీట్​ చేసి, లాయర్​గా ప్రాక్టీస్  స్టార్ట్​ చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ లో అడ్వకేట్ గా చేరారు.  2001లో కేసీఆర్​ టీఆర్​ఎస్​ను స్థాపించడంతో రఘునందన్​ ఆ పార్టీలో చేరి ఉమ్మడి మెదక్​ జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. టీఆర్​ఎస్​ పొలిట్‌బ్యూరో మెంబర్​గా, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2009లో టీఆర్​ఎస్​ తరఫున లోకల్​బాడీ ఎమ్మెల్సీగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. పొలిట్​బ్యూరో మెంబర్​గా ఉండి,  టీడీపీ చీఫ్​ చంద్రబాబును కలిశారనే ఆరోపణలతో 2013లో టీఆర్​ఎస్​ హైకమాండ్​రఘునందన్​రావును పార్టీ నుంచి సస్పెండ్​ చేసింది. దీంతో బీజేపీలో చేరిన రఘునందన్​ రావు.. తన  సొంత నియోజకవర్గం  దుబ్బాకలో బీజేపీని బలోపేతం చేసే దిశగా పని చేశారు. 2014,  2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మెదక్​ లోక్​సభ స్థానానికి  బీజేపీ తరపున బరిలోకి దిగి  ఓటమిపాలయ్యారు. సొంత ప్రాంతంలో పలుమార్లు ఓటములు, అవమానాలు ఎదురైనప్పటికీ రఘునందన్​రావు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎప్పటికప్పుడు బీజేపీ కేడర్​కు  అండగా ఉంటూ వచ్చారు. రఘునందన్​రావుకు మంచి వక్తగా గుర్తింపు ఉంది. వివిధ వేదికలపై, ముఖ్యంగా టీవీ డిబేట్స్​లో వివిధ అంశాలపై తన ఒపీనియన్స్​ వెల్లడించేవారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను తన పదునైన మాటలతో ఎండగట్టడంలో రఘునందన్​రావు దిట్ట.