లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెల్వదు : రఘునందన్​రావు

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెల్వదు : రఘునందన్​రావు
  •     తెలంగాణలో ఆ పార్టీ ఉనికే ఉండదు : రఘునందన్​రావు

హైదరాబాద్, వెలుగు : పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్కసీటు కూడా గెల్వదని, ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు అన్నారు. చేతనైతే కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురు నాయకులు లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్​ విసిరారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత, సంతోష్​లలో ఎవరు పోటీ చేసినా ఒక్కరు కూడా గెలవరన్నారు. ఏ ఒక్కరు గెలిచినా.. దేనికైనా సిద్ధమేనని చాలెంజ్ ​చేశారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు.. అని ప్రచారం చేసుకుంటేనే ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు సింగిల్ డిజిట్​కు పరిమితం చేశారని, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండగా.. బీఆర్ఎస్​ను తెలంగాణ ప్రజలు ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్​గా మారినప్పుడే తెలంగాణతో ఆ పార్టీకి ఉన్న పేగు బంధం తెగిపోయిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ‘సున్నా’ను గుర్తు చేయాలని ప్రజలను కోరారు. ఓడినా కూడా కేటీఆర్​లో గర్వం తగ్గలేదని మండిపడ్డారు. కేసీఆర్ పులి కాదు.. పిల్లి కాదు.. సందులో చొచ్చే ఎలుక అని ఎద్దేవా చేశారు.