దుబ్బాకకు మొదటి విలన్​ మంత్రి హరీశే​ : రఘునందన్​రావు

దుబ్బాకకు మొదటి విలన్​ మంత్రి హరీశే​ : రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: దుబ్బాకకు మొదటి విలన్ మంత్రి హరీశ్​రావేనని బీజేపీ దుబ్బాక అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్​రావు విమర్శించారు. శనివారం అక్భర్​పేట-భూంపల్లి మండల చౌరస్తాలో జరిగిన బీజేపీ కార్నర్​ మీటింగ్​లో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను మంత్రి హరీశ్​రావు అడ్డదారిలో సిద్దిపేటకు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. అక్భర్​పేట-భూంపల్లి మండలం కాకుండా, దుబ్బాకను రెవెన్యూ డివిజన్​ చేయకుండా అడ్డుకున్నారని విమర్శంచారు.

ఉప ఎన్నికల్లో ఇక్కడి ప్రజలకిచ్చిన మాట ప్రకారం అక్భర్​పేట-భూంపల్లి మండలాన్ని చేశానన్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అక్భర్​పేట చౌరస్తాలోని ఇండ్లు, భూములు పోవద్దని ఇక్కడి ప్రజలను ఢిల్లీకి తీసుకుపోయి ఆపింది రఘునందన్​రావు అని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా నిలబడ్డ ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి దుబ్బాకను రెవెన్యూ డివిజన్​ చేయాలని అడగకుండా పబ్​ కావాలని అడగడం చూస్తే దుబ్బాక ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు.

పది సంవత్సరాల్లో ఒక్క రేషన్​ కార్డు ఇవ్వలేదు కానీ 24 గంటల లిక్కర్​ సరఫరా చేసే బెల్ట్​షాపులొచ్చాయని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ రామాయంపేట రెవెన్యూ డివిజన్​ ప్రకటించినప్పుడు అక్కడే ఉన్న ఎంపీ, మంత్రి దుబ్బాకను రెవెన్యూ డివిజన్​ చేయమని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌‌తో​తెలంగాణ ఉద్యమంలో పని చేసిన దుబ్బాక మండలం చీకోడు గ్రామానికి చెందిన టీఆర్ఎస్​ సీనియర్​నాయకులు, కళాకారుడు కొంగరి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు.