డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి : రఘునందన్​రావు

డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి : రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు : డయేరియా ప్రబలిన గ్రామాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రఘునందన్​రావు అధికారులకు సూచించారు. శుక్రవారం దుబ్బాక మండలం బల్వంతాపూర్​, పద్మశాలి గడ్డ, నర్లెంగ గడ్డ, పట్టణ పరిధిలోని దుంపలపల్లి వార్డులో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆయన సందర్శించారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నవారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. నాలుగు గ్రామాల్లో 60 మంది వరకు ఈ వ్యాధి బారిన పడ్డారని తెలిపారు.

ఎడతెరిపి లేని వర్షాలు, కలుషితమైన మిషన్​భగీరథ నీటి సరఫరాతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. పరిసరాల్లో రోజుకు రెండు మార్లు బ్లీచింగ్​ ఫౌడర్​ స్ర్పే చేసి ఈగలు, దోమల్లేకుండా చూడాలని మున్సిపల్​కమిషనర్​కు సూచించారు. ప్రతి ఒక్కరూ శుభ్రతపాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. డయేరియాతో మరణించిన సునుగురు కుంటయ్యకు పూలమాల వేసి నివాళులర్పించారు. మూడు రోజుల కింద అనారోగ్యంతో మరణించిన కూటిగంటి రాజవ్వ కుటుంబాన్ని పరామర్శించారు.

అంతకుముందు ఉధృతంగా ప్రవహిస్తోన్న ఆకారం గ్రామ సమీపంలోని కూడవెళ్లి వాగును పరిశీలించారు. ప్రస్తుతం స్థానిక బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగించవద్దని సూచించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు అంబటి బాలేశ్​గౌడ్​, సుభాష్​రెడ్డి, దూలం వెంకట్​గౌడ్, మచ్చ నివాస్, పుట్ట వంశీ, తొగుట రవి, సుంకోజి ప్రవీణ్, పారిపల్లి సత్యం, సంపంగి అశోక్ ఉన్నారు.