దుబ్బాక నుండి నేరుగా తిరుమలకు వెళ్లిన రఘునందన్ రావు

దుబ్బాక నుండి నేరుగా తిరుమలకు వెళ్లిన రఘునందన్ రావు

శ్రీవారిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

తిరుపతి: మెదక్ జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం 11 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారాయన. నిన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్య విజయం సాధించిన ఆయన ఉదయమే నేరుగా తిరుపతికి వచ్చారు. రేణిగుంటకు చేరుకున్న రఘునందన్ రావుకు ఏపీ బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

గెలిచిన వెంటనే దుబ్బాక నుండి నేరుగా తిరుమల వెంకన్న సన్నిధికి

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో అనూహ్య విజయం సొంతం చేసుకున్న రఘునందన్ రావు ఉదయమే తిరుపతికి వచ్చారు. దుబ్బాక నుండి నేరుగా తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకుని వెంకన్నను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అంతకు ముందే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు.  దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కనువిప్పు కలిగించాలని కోరుకుంటున్నానన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని ఏకపక్షంగా వారికి నచ్చినట్లు పాలిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పాలనకు వ్యతిరేకంగా ఉన్నారని దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికల ఫలితంతో రుజువు చేశారన్నారు. ప్రజలతో మమేకం అయిన వారికి ప్రజలు పట్టం కడతారని దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఏడుకొండల వాడి ఆశీస్సులతో దుబ్బాక నియోజకవర్గం ప్రజలు బీజేపీని ఆదరించి మంచి మార్పునకు నాందిపలికారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీ ప్రజల మన్ననలు పొందేవిధంగా పనిచేస్తుందని రఘునందన్ రావు పేర్కొన్నారు. కొత్తతరం నాయకులు, యువతరం నాయకులు దేశం కోసం.. ధర్మం కోసం ప్రజల మధ్యన తిరిగితే దుబ్బాకలో వచ్చిన ఫలితమే దేశం మొత్తం వస్తుందన్నారు. సాధ్యమైనంత వరకు ప్రజల మధ్యనే ఉండి వారి పక్షాన నిలబడి పోరాడితే దుబ్బాకలో మాదిరే ఆదరిస్తారని తన గెలుపే నిదర్శనంగా నిలుస్తుందన్నారు.  దుబ్బాక ఫలితం చూసిన తర్వాతైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒంటెద్దు పోకడలు మానుకుంటే బాగుంటుందని రఘునందన్ రావు సూచించారు.