
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తెలంగాణ సర్కారు తీపి కబురు అందించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1–10వ తరగతి చదివే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ గా రాగి జావను అందించేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. ఐరన్, సూక్ష్మపోషకాలతో కూడిన పోషకాహారాన్ని అందజేయడంలో భాగంగా రాష్ట్రంలోని సర్కారు బడి విద్యార్థులకు రాగిజావను అందజేస్తారు. రాష్ట్రంలోని 16 లక్షల మంది విద్యార్థులకు ఏడాదిలో 110 రోజులపాటు.. వారంలో మూడు రోజులు రాగి జావను పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలో విద్యార్థులకు బెల్లం, రాగిజావ కలిపిన బ్రేక్‌ఫాస్ట్ అందజేస్తారు.
మధ్యాహ్న భోజనంలో భాగంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు 2023–24 విద్యాసంవత్సరానికి పీఎం పోషణ్ అభియాన్ ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదించింది. ఈ స్కీమ్ కోసం మొత్తం రూ.27.76 కోట్లను ఖర్చు చేయనుండగా... దీనిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.11. 58 కోట్లను వెచ్చిస్తోంది. ఇక కేంద్రం రూ.16.18 కోట్లు మంజూరు చేయనుంది. పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు సర్కారు బడుల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.