దద్దరిల్లిన ఢిల్లీ.. ఈసీ ఆఫీసు వద్ద 9 గంటలు ఉద్రిక్తత

దద్దరిల్లిన ఢిల్లీ.. ఈసీ ఆఫీసు వద్ద 9 గంటలు ఉద్రిక్తత
  • ఈసీ ఆఫీసు వద్ద 9 గంటలు ఉద్రిక్తత
  • జ్ఞానేశ్ రాజీనామా చేయాలని డిమాండ్
  • జాతీయ జెండాతో బారికేడ్లు ఎక్కి రాహుల్ నిరసన
  • బారికేడ్లను తోసుకొని ముందుకు ఉరికిన ప్రియాంక 
  • రాత్రి 8 గంటల వరకు నిర్వాచన్ సదన్ వద్ద ధర్నా
  • అరెస్టు తర్వాత బస్సు దూకి ఈసీ ఆఫీసు వైపు 
  • రాహుల్, ప్రియాంక పరుగులు.. వెంటాడిన పోలీసులు
  • కింగ్స్ వే క్యాంప్ పోలీస్​ స్టేషన్​కు తరలింపు.. విడుదల

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ఇండియా కూటమి ఢిల్లీలో చేపట్టిన మార్చ్ ఉద్రిక్తంగా మారింది. 9 గంటల పాటు ఈ నిరసన కొనసాగింది. లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బారికేడ్లతో రోడ్లను బ్లాక్ చేశారు. భారీ సంఖ్యలో బలగాలను మోహరించి ప్రతిపక్ష నేతలను నిర్వాచన్ సదన్ వైపు వెళ్లకుండా నిలువరించారు. పోలీసులను తప్పించుకుంటూ, బారికేడ్లను దాటుకుంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముందుకు దూసుకెళ్లారు. ఆయన వెనుక పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు నినాదాలు చేస్తూ, సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  

పలు అంచెల బారికేడ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగిన రాహుల్ గాంధీ, అకస్మాత్తుగా ఒక బారికేడ్ పైకి ఎక్కి పెద్ద జాతీయ జెండాను ఊపారు. ఎస్ఐఆర్ (సర్) పేరుతో ఓటర్ల జాబితా ప్రక్షాళనలో జరిగిన అక్రమాలపై సీఈసీ రాజీనామా కోరుతూ నిరసన తెలుపుతున్న ‘ఇండియా’ కూటమి నేతలు, కార్యకర్తలు ఈ దృశ్యాన్ని చూసి పెద్దపెట్టున నినాదాలు చేశారు.నిర్వాచన్ సదన్​కు దాదాపు 50 అడుగుల దూరంలోని ఆకాశవాణి భవన్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్, ప్రియాంక అక్కడే బైఠాయించారు. సీఈసీ జ్ఞానేశ్​ను కలవకుండా కదిలేది లేదని పోలీసులకు తేల్చిచెప్పారు. ఓట్ చోరీ ముమ్మాటికీ దేశద్రోహమేనని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్​ మోహన్ భాగవత్, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లు త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

9 గంటల పాటు సాగిన నిరసన

రాహుల్, ప్రియాంక బైఠాయించడంతో ఆకాశవాణి బిల్డింగ్ వద్ద టెన్షన్ నెలకొంది. ఇండియా కూటమి నేతలు, కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. దాదాపు 9 గంటల పాటు ఆందోళన కొనసాగగా.. రాత్రి 8 గంటల సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు రాహుల్, ప్రియాంకలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో రాహుల్, ప్రియాంక, తదితర ఎంపీలను పోలీసులు బలవంతంగా  బస్సులోకి ఎక్కించారు. కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, రాహుల్, ప్రియాంకను పోలీసులు ఈడ్చుకెళ్లారు. 

ఈ సందర్భంగా కార్యకర్తల నుంచి ప్రతిఘటన ఎదురైంది. కాంగ్రెస్ అగ్రనేతలతోపాటు ప్రతిపక్ష కూటమికి చెందిన 10 మంది ఎంపీలతో సహా మొత్తం 260 మంది నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నేతలందరినీ ఉత్తర ఢిల్లీలోని కింగ్స్‌‌వే క్యాంప్ పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. అంతకుముందు కూడా రాహుల్, ప్రియాంకా గాంధీలను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించేందుకు బస్సు ఎక్కించారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ బస్సు నుంచి కిందకు దూకి నేరుగా ఈసీఐ భవనం వైపు పరుగులు తీశారు. కాగా, సుమారు 2 గంటల తర్వాత రాహుల్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్​ నేతలను పోలీసులు పంపించారు.