టీమిండియా దృష్టంతా రెండు అంశాలపైనే: రాహుల్ ద్రవిడ్

టీమిండియా దృష్టంతా రెండు అంశాలపైనే: రాహుల్ ద్రవిడ్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తే లక్ష్యంగా టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడబోతుంది. ఈ నేపథ్యంలో వీసీఏ స్టేడియంలో టీమిండియా చెమటోడుస్తోంది. ఇందులో భాగంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్టు సిరీస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా చేస్తున్న ప్రాక్టీసులో రెండు అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ద్రవిడ్ వెల్లడించారు. ఎక్కువగా స్లిప్స్ లో ఫీల్డింగ్, క్యాచులపై ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ద్రవిడ్ వ్యాఖ్యలకు సంబంధించిన  వీడియోను బీసీసీఐ  ట్విటర్‌లో  పోస్టు చేసింది. 

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్కు ఎంపికైన ప్రతీ ఆటగాడు ఉత్సాహంతో ఉన్నారని ద్రవిడ్ తెలిపాడు. ఈ మధ్య కాలంలో టీమిండియా వన్డేలు, టీ20లు ఎక్కువగా ఆడిందని..చాలా రోజుల తర్వాత మళ్లీ టెస్టులు ఆడటం బాగుందన్నాడు. ఈ నాలుగు టెస్టులు భారత్కు కీలకం కానున్నాయని..ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పాడు. ముఖ్యంగా స్లిప్పులో ఫీల్డింగ్, క్యాచులపై ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించాడు. గత కొద్ది కాలంగా తీరిక లేని క్రికెట్ ఆడామని..ప్రస్తుతం దొరికిన సమయాన్ని లోపాలు సవరించుకునేందుకు ఉపయోగించుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ప్రాక్టీస్ తమ కుర్రాళ్లకు సత్ఫలితాలిస్తాయని నమ్మకముందన్నాడు. 

1996-97లో తొలిసారి జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని  టీమిండియా దక్కించుకుంది. ఆ తర్వాత 2016-17, 2018-2019,2020-2021లోనూ టీమిండియానే విజేతగా నిలిచింది. ఇక నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు నాగ్‌పుర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానుంది