పేపర్​ లీకేజీల్లో కేసీఆర్​ బంధువులు.. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు: రాహుల్​

పేపర్​ లీకేజీల్లో కేసీఆర్​ బంధువులు.. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు: రాహుల్​

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీల్లో కేసీఆర్​ బంధువులున్నారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. పేపర్​ లీకులకు పాల్పడి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని సోమవారం ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు. దొరల కేసీఆర్​ సర్కార్​ పాలనలో రాష్ట్ర నిరుద్యోగులు, యువత తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తాను అశోక్​నగర్​కు వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడానని, వారు చెప్పిన మాటలు, వారి పరిస్థితిని చూసి చాలా బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పంపిన డబ్బుతో ఏండ్ల తరబడి చదువుతూనే ఉన్నారని, అయినా కూడా కొలువులు రాక మనస్తాపానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వారికి మంచి ఉపాధి, విద్యావకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 

కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే తీసుకునే తొలి నిర్ణయం జాబ్​ క్యాలెండరేనని తేల్చి చెప్పారు. తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేసి.. యూపీఎస్సీ తరహాలో మారుస్తామన్నారు. యువ వికాసం స్కీమ్​ కింద విద్యాభరోసా కార్డును అందించి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. తాము ప్రకటించిన గ్యారంటీలన్నింటినీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కాంగ్రెస్  సర్కార్​ చేతిలో భద్రంగా ఉంటుందని, అది తన గ్యారంటీ అని రాహుల్​ స్పష్టం చేశారు.