తెలంగాణ, కర్నాటకలో త్వరలో రోహిత్ వేముల చట్టం : రాహుల్ గాంధీ

తెలంగాణ, కర్నాటకలో త్వరలో రోహిత్ వేముల చట్టం : రాహుల్ గాంధీ
  • కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడి  
  • దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని తేవాలని కేంద్రానికి డిమాండ్ 

న్యూఢిల్లీ, వెలుగు: విద్యాసంస్థల్లో కుల వివక్షను రూపుమాపడానికి చట్టం తేవాలని దళిత యువత -పోరాడాలని లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. తాము అధికారంలో ఉన్న తెలంగాణ, కర్నాటకలో త్వరలోనే రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చి, అన్ని విద్యాసంస్థల్లో అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇకపై ఏ దళిత విద్యార్థి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాల్సిన అవసరం రావొద్దన్నారు. ఆ దిశలో న్యాయం, మానవత్వం, సమానత్వం కలిగిన భారతదేశ నిర్మాణం జరగాలన్నారు. రోహిత్ వేముల 10వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ శనివారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో రాహుల్ పోస్టు పెట్టారు.

రోహిత్ ఆత్మహత్య తర్వాత తాను హెచ్‌‌సీయూను సందర్శించిన వీడియోను దీనికి జత చేశారు. ‘‘రోహిత్ వేముల మరణించి నేటికి పదేండ్లు. ‘ఈ దేశంలో అందరికీ కలలు కనే హక్కులు ఉన్నాయా?’ అనే రోహిత్ ప్రశ్న ఇప్పటికీ మన హృదయాల్లో మెదులుతూనే ఉంది. రోహిత్ దేశ అభివృద్ధిలో భాగం కావాలనుకున్నాడు. కానీ ఈ వ్యవస్థ దళితుడి ఎదుగుదలను అంగీకరించలేదు. హెచ్‌‌సీయూలో కులతత్వం, సామాజిక బహిష్కరణ, అవమానం.. రోహిత్ వేములను ఒంటరి చేశాయి. అతను చనిపోయి ఇన్నేండ్లయినా దళిత యువతకు క్యాంపస్‌‌లో అదే అవమానం జరుగుతున్నది. హాస్టళ్లలో అదే ఒంటరితనం.

తరగతిలో అదే న్యూనత, అదే హింస. ఆత్మహత్యలు ఉన్నయ్. ఎందుకంటే కులం రక్కసి ఇప్పటికీ ఈ దేశంలో మిగిలే ఉన్నది. అందుకే రోహిత్ వేముల చట్టం ఒక నినాదం కాదు.. అది ఒక అవసరం. విద్యాసంస్థల్లో కుల వివక్షను నేరంగా పరిగణించాలి. ఎవరైనా వివక్ష చూపిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటం మనందరి కోసం.. ‘రోహిత్.. మీ పోరాటం మా బాధ్యత’’  అని రాహుల్ పేర్కొన్నారు.