కేసీఆర్‌, మోదీ కలిసి సింగరేణిని అదానీకి అమ్మాలని చూశారు : రాహుల్ గాంధీ

 కేసీఆర్‌, మోదీ కలిసి సింగరేణిని అదానీకి అమ్మాలని చూశారు  : రాహుల్ గాంధీ

తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనన్నారు కాంగ్రెస్  ఎంపీ రాహుల్ గాంధీ. బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టేనని చెప్పారు.  పెద్దపల్లిలో జరిగిన  విజయభేరి  సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.  కేసీఆర్‌, మోదీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని,  కేసీఆర్‌, మోదీ కలిసి సింగరేణిని అదానీకి అమ్మాలని చూశారని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ అడ్డుకుందని తెలిపారు.  సింగరేణి ప్రైవేటుపరం కాకుండా కాపాడుతామని హామీ ఇస్తున్నానని చెప్పారు.   

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పాలిత  రాష్ట్రంలో ఇచ్చిన హామీలను  అమలు చేస్తున్నామని చెప్పుకోచ్చారు. తెలంగాణతో తనకున్నది రాజకీయ సంబంధం కాదన్న రాహుల్ ..  తెలంగాణ ప్రజలతో తనకున్నది ప్రేమ, కుటుంబ అనుబంధమని  చెప్పారు. తెలంగాణకు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.  ఈ ఎన్నికలు దొరల తెలంగాణ , ప్రజల తెలంగాణకు మధ్య  జరుగుతున్నాయని అభివర్ణించారు.  

తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు రాహుల్ గాంధీ.  కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఈ పదేళ్లలో నెరవేర్చారా లేదా అని ప్రజలు ఆలోచించాలని కోరారు. కేసీఆర్ ఒక సీఎంగా కాకుండా.. ఓ రాజు లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  కేసీఆర్ ఫ్యామిలీ ప్రభుత్వంలోని కీలక శాఖలను చూస్తుందని విమర్శించారు.  కాళేశ్వరంలో వలన కాంట్రాక్టర్లకు మాత్రమే మేలు జరిగిందని చెప్పారు.  ధరణి పోర్టల్  ద్వారా పేదల  భూములు లాక్కున్నారని ఆరోపించారు.  భూములు రికార్డులను  మార్చి పేదలను ముంచారని తెలిపారు .  భూస్వాములకే రైతుబంధు ఉపయోగపడిందని రాహుల్ చెప్పారు.