రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తం

రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తం
  • యూపీ ప్రచార సభలో రాహుల్ గాంధీ

బాంస్​గావ్ (యూపీ), న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై చట్టపరమైన 50 శాతం పరిమితిని ఇండియా కూటమి ప్రభుత్వం ఎత్తేస్తుందని కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచుతుందని వివరించారు. దీంతో పాటు రాజ్యాంగ రక్షణకు ప్రాధాన్యమిస్తామని, అవసరమైతే రక్తం ధారబోసి అయినా సరే (దిల్, జాన్ ఔర్ ఖూన్) కాపాడుకుంటామని చెప్పారు.

బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రూపకల్పన చేసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం తమ విధి అని చెప్పారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించారు. ఈమేరకు ఉత్తరప్రదేశ్​లోని బాంస్​గావ్ లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. కూటమి తరఫున ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ తరఫున రాహుల్ ​గాంధీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ర్యాలీకి హాజరైన ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఇండియా కూటమి ఉండగా.. మరోవైపు, రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తున్న ఎన్డీయే కూటమి ఉందని చెప్పారు. దేనికి అధికారం కట్టబెట్టాలో నిర్ణయించుకోవాలని ప్రజలకు రాహుల్ పిలుపునిచ్చారు. ఏళ్ల తరబడి అన్యాయానికి, అక్రమాలకు, వేధింపులకు గురైన దళితులకు గౌరవంగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. అయితే, బీజేపీకి ఇది ఎంతమాత్రమూ నచ్చట్లేదని, అందుకే రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారని రాహుల్ తెలిపారు. 

మోదీ హయాంలో న్యాయం కనుమరుగు

ప్రజాస్వామ్య, న్యాయ పాలనకు మోదీ ముగింపు పలికారని రాహుల్ ఆరోపించారు. బీజేపీ హయాంలోని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నిందితులకు అండగా నిలుస్తున్నాయని ట్వీట్​ చేశారు. మధ్యప్రదేశ్​లో మృతిచెందిన దళిత మహిళ కుటుంబం విషయంలో జరిగిందే నిదర్శనమన్నారు. లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన మహిళే హత్యకు గురైందంటే పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.