- జూబ్లీహిల్స్ గెలుపుపై సీఎం టీమ్‌కు రాహుల్ గాంధీ అభినందనలు
- ఈ విజయంతో బాధ్యత మరింత పెరిగిందన్న కాంగ్రెస్ అగ్రనేత
- రాహుల్‌కు ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను పరిచయం చేసిన సీఎం
- కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతోనూ రేవంత్ బృందం భేటీ
- డీసీసీ చీఫ్‌ల నియామకం, స్థానిక ఎన్నికలు తదితర అంశాలపై చర్చ
- హాజరైన మీనాక్షి, భట్టి, మహేశ్ గౌడ్
న్యూఢిల్లీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అభినందించారు. ‘శభాష్.. రేవంత్’ అంటూ భుజం తట్టారు. మంత్రుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని గెలుపు తీరాలకు చేర్చడం గొప్ప విషయమని కొనియాడారు.
బీఆర్ఎస్‌కు పట్టున్న జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీ సాధించడంపై సీఎం రేవంత్, ఆయన బృందానికి రాహుల్, కేసీ వేణుగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని టీమ్ రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను సీఎం రేవంత్ పరిచయం చేశారు.
బీఆర్ఎస్ ఇలాకాలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో పార్టీ శ్రేణులు చేసిన కృషిని వివరించారు. పార్టీ విజయం కోసం కార్యకర్తలే ముందుండి పోరాడారని చెప్పారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. పార్టీ విజయం కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు శుభాకాంక్షలు చెప్పారు.
‘‘బీఆర్ఎస్‌కు పట్టున్న జూబ్లీహిల్స్‌లో ప్రజలు మన పార్టీని గెలిపించారు. అంటే మనపై మరింత బాధ్యత పెరిగింది. ఈ విషయం గుర్తుంచుకోండి” అని సూచించారు. సమావేశంలో పార్టీ స్టేట్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, నవీన్ యాదవ్ శాలువాతో సత్కరించారు.
ఖర్గేతోనూ భేటీ..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను ఖర్గే అభినందించారు. ఖర్గేతో కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఇతర అంశాలపై సీఎం బృందం చర్చించినట్టు తెలిసింది. ఈ భేటీ అనంతరం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్‌కు సంబంధించిన ఒక ప్రైవేట్ ప్రొగ్రాంలో సీఎం పాల్గొన్నారు. కాగా, ఆదివారం ఉదయం10 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్‌తోనే యావత్ తెలంగాణ: పీసీసీ చీఫ్
జూబ్లీహిల్స్ బైపోల్‌లో వచ్చిన భారీ మెజార్టీ.. యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే ఉందన్న సందేశాన్ని ఇచ్చిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రెండేండ్ల ప్రజాపాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఎంఐఎం మద్దతు, డబ్బులతో కాంగ్రెస్ గెలిచిందన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని, ఆ పార్టీ నేతగా కిషన్ రెడ్డి ఏం మాట్లాడినా ప్రజలు ఆదరించరని అన్నారు. ‘‘జూబ్లీహిల్స్ బైపోల్ ఘన విజయంతో అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కలిశాం. రాష్ట్ర నాయకత్వాన్ని హైకమాండ్పెద్దలు అభినందించారు’’ అని చెప్పారు.
కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అందకుండా బీజేపీనే అడ్డంకులు సృష్టించిందని ఫైర్ అయ్యారు. కాగా, తనను మంత్రివర్గంలోకి తీసుకుంటారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆ జాబితాలో తన పేరు లేదని చెప్పారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి అబద్ధం: నవీన్ యాదవ్
ప్రజా సేవ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపేందుకు ఢిల్లీకి వచ్చానని జూబ్లీహిల్స్ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చెప్పారు. ‘‘నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో నన్ను ఆశీర్వదించారు. వాళ్లందరికీ రుణపడి ఉంటాను. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌తో కలిసి కాంగ్రెస్ అగ్రనేతల ఆశీర్వాదం తీసుకున్నాను’ అని తెలిపారు. కాగా, కాంగ్రెస్కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారని కేటీఆర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తాము ఎలాంటి దాడులు చేయలేదని, అదంతా తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు.
డీసీసీల నియామకాలపై చర్చ..
రాహుల్‌ను కలిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వాహనంలోనే కేసీ వేణుగోపాల్‌తో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి బయటకు వచ్చారు. జన్‌పథ్ 10 నుంచి నేరుగా కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. అక్కడ కాసేపు కేసీతో సీఎం, రాష్ట్ర ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులను సీఎం వివరించారు. జూబ్లీహిల్స్ గెలుపు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలు, డీసీసీ అధ్యక్షుల నియామకాలు, మంత్రివర్గం వంటి పలు అంశాలపై చర్చించినట్టు తెలిసింది.
