రాహుల్ గాంధీ పరువునష్టం కేసు... గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

 రాహుల్ గాంధీ పరువునష్టం కేసు...  గుజరాత్  ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

పరువునష్టం కేసులోతనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వేసిన  పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2023 జూలై 21 శుక్రవారం రోజున విచారించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, పీకే మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు .. ఈ కేసులో ప్రతివాది అయిన గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనికి రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. అనంతరం 2023 ఆగస్టు4 కు విచారణను వాయిదా వేసింది.  రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తున్న క్రమంలో..  ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాలతో సహా 122 రోజుల పార్లమెంటు సమావేశాల్ని రాహుల్​ కోల్పోయారన్నారు.  

2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో రాహుల్ గాంధీ మోదీ ఇంటిపేరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయనపై పరువునష్టం కేసు నమోదైంది.   పూర్ణేశ్ మోదీ  దాఖలు చేసిన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించడాన్ని నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.