మోదీ 'ఈస్టిండియా కంపెనీ' వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఎదురుదాడి

మోదీ 'ఈస్టిండియా కంపెనీ' వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఎదురుదాడి

ప్రతిపక్షాల కూటమిపై ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అల్లర్లతో దెబ్బతిన్న మణిపూర్ రాష్ట్రం కోలుకునేందుకు ప్రతిపక్షం తమ వంతు సహాయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ''మోదీజీ...మీరు మమ్మల్ని ఏవిధంగానైనా పిలవండి... ఉయ్ ఆర్ ఇండియా'' అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. "మిస్టర్ మోదీ, మీకు ఏది కావాలన్నా మమ్మల్ని పిలవండి. మేము మణిపూర్‌కు సాయం చేయడానికి, ప్రతి స్త్రీ, పిల్లల కన్నీళ్లు తుడవడానికి సహాయం చేస్తాము. మేము ఆమె ప్రజలందరికీ ప్రేమ, శాంతిని తిరిగి అందిస్తాం. మేము మణిపూర్‌లో భారతదేశ ఆత్మను పునర్నిర్మిస్తాం" అని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ట్వీట్ లో రాసుకువచ్చారు.

ఈరోజు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి చారిత్రక సంస్థలపైనా ఇండియా అనే పేరు ఉందని అని నొక్కి చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోగలదని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలా ఏ లక్ష్యం లేకుండా ముందుకెళ్లే ప్రతిపక్షాలను ఇప్పటివరకూ తాను చూడలేదన్న ఆయన.. అలాంటి వారు అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని, వారు ఎప్పటికీ విపక్షాలుగానే ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు.