దళిత దండోరాకు రాహుల్ గాంధీ రాబోతున్నారు

దళిత దండోరాకు రాహుల్ గాంధీ రాబోతున్నారు
  • టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

హైదరాబాద్: దళిత దండోరా కార్యక్రమం గురించి రాహుల్ గాంధీతో చర్చించామని.. కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను స్వయంగా వస్తానని రాహుల్ గాంధీ తెలిపారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే సెప్టెంబరు మొదటి వారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందని.. ప్రాంతం, తేదీ ఎక్కడ, ఎప్పుడు అనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఒక రోజంతా మనం రాహుల్ గాంధీ  గారి కార్యక్రమం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. బుధవారం గాంధీ భవన్ లో హుజురాబాద్ ఉపఎన్నికపై  టీపీసీసీ సమీక్షా సమావేశం జరిగింది. ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర్ రాజా నరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, చిన్నారెడ్డి కరీంనగర్ జిల్లా ముఖ్యనేతలు, హుజురాబాద్ ఉపఎన్నికల ఇంచార్జులు పాల్గొన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో పోటీ, అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై సమీక్షించారు కాంగ్రెస్ నేతలు. 
ఈ సందర్బంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ సమిష్టి నిర్ణయం మేరకే అన్ని పనులు జరుగుతాయని, నాయకుల సూచనల మేరకు నిర్ణయాలు జరుగుతాయన్నారు. క్షేత్ర స్థాయి లో కలిసి కట్టుగా సమిష్టిగా పని చేయాలని సూచించారు. ఇప్పటికే మనం ఒక కమిటీ వేసుకొని పని చేసుకుంటున్నామని, నాయకులు చేసే సూచనలు ఖచ్చితంగా పాటించి పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని కొంతమందిని కోవర్టులుగా తయారు చేసుకుని  కేసీఆర్ రాజకేయ లబ్ది పొందిన విషయాలు మనం చూసామని గుర్తు చేశారు. ‘‘కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవద్దు.. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. పార్టీ కి వ్యతిరేకంగా ఎవరు పని చేసిన కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.. అది నాతో సహా.. బాధ్యతాయుతంగా పనులు చేస్తేనే గౌరవం పెరుగుతాది. మనం అప్రమతంగా ఉండి పని చేయాలి..’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 
9వ తేదీన ఇంద్రవెళ్లి లో దళిత, గిరిజన దండోరా 
ఈనెల 9వ తేదీన ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా కార్యక్రమం చేపట్టామని.. అలాగే ఈనెల 11 నుంచి 21వ తేదీ వరకు పది రోజుల పాటు 5 మండలాలు, 2 మునిసిపాలిటీ లు తీసుకొని ప్రతి రోజు ఒక ప్రాంతంలో 2, 3 వేల మందితో ర్యాలీలు, సమావేశాలు జరపాలని, అలాగే  7 మీటింగ్ లు జరగాలని, మండలంలో ఉన్న ఓట్లు లో పది శాతం మీటింగ్ కు వచ్చేలా ప్రణాళిక చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివరించారు. 
కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయాలని, అనుబంధ సంఘాల నాయకులను క్షేత్ర స్థాయిలో పని చేయించాలని రేవంత్ రెడ్డి కోరారు. హుజురాబాద్ లో మనం అభ్యర్థి విషయంలో సామాజిక వర్గం, కార్యకర్తల కోసం పార్టీ కోసం పని చేసే వాడు కావాలన్నారు. హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో పొన్నం ప్రభాకర్, దామోదర రాజ నర్సింహలు కలిసి సిఫారసు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.