న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ లపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఎన్నికల సంఘం ఆఫీసుకు సమీపంలో బైఠాయించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఓట్ చోరీ ద్వారా వారు దేశాన్ని హైజాక్ చేశారని, ఇది ముమ్మాటికీ దేశద్రోహమేనని అన్నారు.
ఈ నేరానికి పాల్పడిన వారంతా త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటారని, ఇందులో ఏ ఒక్కరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఎన్నికల సంఘం వివాదాస్పద నిర్ణయాలకు నిరసనగా ఇండియా కూటమి చేపట్టిన మార్చ్‌లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నేతలు నినదించారు.
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే(సర్)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇండియా కూటమిలోని వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు ఈ మార్చ్ లో పాల్గొన్నారు. ఈ నిరసనలో పాల్గొన్న సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓ బ్రియాన్ లతో పాటు పలువురు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జ్ఞానేశ్ ఎందుకు భయపడుతున్నారు..?
ప్రతిపక్ష ఎంపీలలో కనీసం 300 మంది ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను కలుసుకోవాలని భావిస్తున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎంపీలను కలిసేందుకు సీఈసీ ఎందుకు భయపడుతున్నారని ఆయన నిలదీశారు. కేవలం బీజేపీని ఎదుర్కోవడం మాత్రమే తమ లక్ష్యం కాదని, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే పోరాడుతున్నామని చెప్పారు.
‘దేశ గొంతుకను అవమానించారు. మేం కేవలం సీఈసీని కలిసి మీరు ఓట్లు దొంగిలించారని చెప్పాలనుకుంటున్నాం. ఇక్కడ కూర్చోవడానికి మాకు ఎలాంటి ఇబ్బందిలేదు. ఎంతకాలమైనా కూర్చుంటాం. ఇక్కడ కూర్చోవడానికి వీల్లేదంటే, ఢిల్లీలో వేరే చోటు చూపించండి, అక్కడికి వెళ్లి కూర్చుంటాం’ అంటూ పోలీసులపై రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు.
