మోడీ – అదానీకున్న సంబంధమేంటి? కేంద్రంపై రాహుల్ ఫైర్

మోడీ – అదానీకున్న సంబంధమేంటి? కేంద్రంపై రాహుల్ ఫైర్

ప్రధాని మోడీ, అదానీకి మధ్య ఉన్న సంబంధమేంటని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశమంతా అదానీ సక్కెస్ వెనుక ఎవరున్నారన్నది తెలుసుకోవాలనుకుంటోందని అన్నారు. రాష్ట్రపతి స్పీచ్ పై ధన్యవాద తీర్మానం సందర్భంగా లోక్ సభలో రాహుల్ అదానీ అంశాన్ని లేవనెత్తారు. మోడీ, అదానీ కలిసి ఉన్న ఫొటోను రాహుల్ ప్రదర్శించగా బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ రాహుల్ ను వారించారు. అనంతరం మాట్లాడిన రాహుల్ గాంధీ 2014లో 8బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ సంపద 2022 నాటికి 140 మిలియన్ డాలర్లకు ఎలా పెరిగిందని యువత తెలుసుకోవాలనుకుంటున్నారని అన్నారు. కశ్మీర్ యాపిల్స్ నుంచి పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్ల వరకు అన్ని ప్రాజెక్టులను చేపట్టే సత్తా కేవలం అదానీకి  మాత్రమే ఉందని రాహుల్ సటైర్ వేశారు. 

ప్రధాని, అదానీ మధ్య బంధం ఈ నాటిదికాదన్న రాహుల్... మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న నాటి వారు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారని అన్నారు. 2014లో మోడీ ఢిల్లీ పీఠం ఎక్కడం వెనుక అదానీ ఉన్నారని ఆరోపించారు. ఎయిర్ పోర్టులకు సంబంధించి ఎలాంటి అనుభవం లేని కంపెనీలకు వాటి డెవలప్ మెంట్ పనులు అప్పగించొద్దన్న రూల్ ను అదానీ కోసం కేంద్రం మార్చేసిందని రాహుల్ ఆరోపించారు. ప్రస్తుతం అదానీ చేతిలో ఆరు ఎయిర్ పోర్టులు ఉన్నాయని, చివరకు అత్యంత లాభదాయకమైన ముంబై ఎయిర్ పోర్టును సైతం సీబీఐ, ఈడీలను ఉపయోగించి జీవీకే నుంచి లాక్కొని అదానీకి అప్పజెప్పారని విమర్శించారు. డ్రోన్ల తయారీలో అనుభవం లేకపోయినా హెచ్ఏఎల్ ను కాదని అదానీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆరోపించారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టడం వెనుక కారణాలతో పాటు ఇప్పటి వరకు ఆయనకు ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలుంటే చూపించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ కు సూచించారు.