
ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్గా తప్పుకునే అవకాశం
నేడు సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రకటన! ఇప్పటికే ఇద్దరు పీసీసీ చీఫ్‌ల రాజీనామా
పార్టీ ఓటమి, ఇకముందు ఏం చేయాలన్న దానిపై చర్చించే చాన్స్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. శనివారం జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో రాజీనామా చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ పార్టీ చీఫ్ రాజ్‌బబ్బర్, ఒడిశా పార్టీ చీఫ్ నిరంజన్ పట్నాయక్ రాజీనామాలు చేశారు. పార్టీ ఓటమికి కారణాలను సీడబ్ల్యూసీ భేటీలో చర్చించనున్నారు. దీనికి పార్టీ సీనియర్ నేతలతోపాటు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరు కానున్నారు. 2014 ఎన్నికల్లో 44 సీట్లు మాత్రమే గెల్చుకున్న కాంగ్రెస్ ఈసారి 52 సీట్లతో సరిపెట్టుకుంది. యూపీలో సోనియాగాంధీ బరిలో ఉన్న రాయ్‌బరేలీని మాత్రమే గెల్చుకుంది. అమేథీలో రాహుల్ ఓడిపోయారు. లోక్‌సభలో ఈసారి కూడా ప్రతిపక్ష హోదా దక్కే చాన్స్ కన్పించడం లేదు.
పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారా అని జర్నలిస్టులు గురువారం రాహుల్‌ను ప్రశ్నించగా.. దానిపై సీడబ్ల్యూసీలో నిర్ణయం ఉంటుందని చెప్పారు. ‘‘ఈ ఫలితాలు తీవ్ర నిరాశ మిగిల్చాయి. నా బాధ్యతలు సరిగా నిర్వర్తించలేదన్న బాధ ఉంది. పార్టీ పెద్దలను కలిసి నా ఆలోచనలు చెబుతా’’ అని యూపీ రాష్ట్ర చీఫ్ రాజ్ బబ్బర్ ట్విటర్‌లో కామెంట్ చేశారు. ఫతేపూర్ సిక్రీ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ‘‘పార్టీ బాగు కోసం గట్టి చర్యలు తీసుకోవాల్సిన టైం వచ్చింది. అవకాశవాదులను పార్టీకి దూరంగా పెట్టాలి. యూత్‌కు మరింత దగ్గరవ్వాలి’’ అని ఒడిశా పీసీసీ చీఫ్ పట్నాయక్ అన్నారు.