పరువునష్టం కేసు.. సుప్రీంలో రాహుల్ పిటిషన్

పరువునష్టం కేసు..  సుప్రీంలో రాహుల్ పిటిషన్

న్యూఢిల్లీ: మోదీ సర్ నేమ్ పై కామెంట్లకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను దోషిగా తేలుస్తూ గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు జులై 7న ఆ రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ శనివారం సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ తరఫున అడ్వకేట్ ప్రసన్న ఎస్. 

ఈ పిటిషన్ వేశారు. కాగా, 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘మోదీ ఇంటి పేరు పెట్టుకున్నోళ్లంతా దొంగలే’ అనే అర్థం వచ్చేలా రాహుల్ కామెంట్ చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం కేసు వేయగా.. సూరత్ లోని కోర్టు ఈ ఏడాది మార్చి 24న రాహుల్ కు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఫలితంగా రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు పడింది. ఆ తర్వాత సూరత్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ కోర్టు, హైకోర్టు నిరాకరించడంతో తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఒకవేళ ఈ కేసులో తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చి ఉంటే.. రాహుల్ ఎంపీ పదవి పునరుద్ధరణకు అవకాశం ఉండేది. మరోవైపు రాహుల్ అప్పీల్ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తే తన వాదనను కూడా వినాలని కోరుతూ పూర్ణేశ్ మోదీ ఇదివరకే సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.