ఎంఐఎం ఎక్కడెక్కడ పోటీ చేయాలో... బీజేపీ లిస్టు తయారు చేసి ఇస్తోంది: రాహుల్ గాంధీ

ఎంఐఎం ఎక్కడెక్కడ పోటీ చేయాలో... బీజేపీ లిస్టు తయారు చేసి ఇస్తోంది: రాహుల్ గాంధీ

గెలిచే బలం లేకపోయినా ఎంఐఎం అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్ ను ఓడించేందుకే ఎంఐఎం పోటీ చేస్తోందని చెప్పారు. ఎంఐఎం ఎక్కడెక్కడ పోటీ చేయాలో... బీజేపీ లిస్టు తయారు చేసి ఇస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో బీజేపీని ఓడించి తీరతామని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ, ఎంఐఎంకు ఓటు వేస్తే అది బీఆర్ఎస్ కు వేసినట్లేని తెలిపారు. తెలంగాణలో రాబోయేది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమని రాహుల్ గాంధీ తెలిపారు. 

బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని రాహుల్ గాంధీ  అన్నారు. బీఆర్ఎస్ కారు టైర్ లో వారికి తెలియకుండానే గాలి పోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో చేరేందుకు బీజేపీ నుంచి క్యూ కడుతున్నారన్నారు. బీజేపీతో పోరాడిన తనపై 24 కేసులు పెట్టారని రాహుల్ గాంధీ చెప్పారు. మరి కేసీఆర్ పై ఎన్ని కేసులున్నాయని ప్రశ్నించారు. విపక్షాలపై కేసులు పెట్టె ప్రధాని మోదీ.. కేసీఆర్ పై ఎందుకు పెట్టరని నిలదీశారు. పార్లమెంట్ లో ప్రతీ బిల్లుకు బీజేపీకి బీఆఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. 

తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయిందని రాహుల్ గాంధీ విమర్శించారు. కేసీఆర్ పదేళ్లుగా ప్రజల సొమ్ము దోచుకున్నారని..ఆయన కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. పసుపు రైతులకు ప్రధాని మోదీ హామీ ఇచ్చి మోసం చేశారని తెలిపారు. తాను అబద్ధపు హామీలు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదని రాహుల్ గాంధీ చెప్పారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేసి తీరతామని హామీ ఇచ్చారు. తెలంగాణతో తనకున్న అనుబంధం ఇప్పటిది కాదు.. ఇందిరమ్మ నాటి నుంచి ఈ బంధం కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ తమ కుటుంబానికి అండగా ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు.