తుక్కుగూడ సభ సక్సెస్ తో ఫుల్ జోష్.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలం

తుక్కుగూడ సభ సక్సెస్ తో ఫుల్ జోష్.. ఎంపీ ఎన్నికల్లో  కాంగ్రెస్ కు అనుకూలం

తుక్కుగూడ జన జాతర సభ సక్సెస్ కావడంతో రాహుల్‌‌ గాంధీతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఫుల్ జోష్‌‌లో ఉన్నారు. ఆశించినట్టుగా సభకు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. రాహుల్‌‌ గాంధీ, రేవంత్‌‌రెడ్డి మాట్లాడుతున్నప్పుడు, వారి మాటలను జనాలు శ్రద్ధగా విన్నారు. రాహుల్‌‌ను ప్రధానిని చేద్దాం అన్నప్పుడు, జోష్‌‌గా రెస్పాండ్ అయ్యారు. 

ఎండలో వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి కూడా చాలా ఉత్సాహంగా సభలో పాల్గొనడంతో, జనాల్లో పార్టీకి పాజిటివ్ వైబ్ ఉందని కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన దానికంటే ఎక్కువ శాతం ఓట్లను పార్టీ సాధిస్తుందని, ఎక్కువ సీట్లను గెలుపొందుతామని పార్టీ ధీమా వ్యక్తంచేస్తున్నది. 

కాంగ్రెస్​కు అనుకూల పరిస్థితులు

అసెంబ్లీ ఎన్నికల్లో 9 పార్లమెంట్​నియోజకవర్గాల్లోని శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించింది. పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్‌‌‌‌కర్నూల్‌‌, భువనగిరి, నల్గొండ, జహీరాబాద్‌‌, మహబూబ్‌‌నగర్‌‌‌‌ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు సాధించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ, మల్కాజ్‌‌గిరి, భువనగిరి సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. 

ఈ మూడింటిలో రెండు స్థానాల్లో ఇప్పుడు కూడా కాంగ్రెస్ లీడ్‌‌లో ఉంది. ఇక గత ఎన్నికల్లో కరీంనగర్‌‌‌‌, నిజామాబాద్, ఆదిలాబాద్‌‌, సికింద్రాబాద్ ఎంపీ సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా, ఈ నాలుగు స్థానాల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వెనుకబడింది. కరీంనగర్‌‌‌‌ ఎంపీ బండి సంజయ్‌‌, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ఓడిపోయారు. 

ముగ్గురిపై బీఆర్‌‌‌‌ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఆ ముగ్గురు సిట్టింగ్‌‌ ఎంపీలుగా ఉన్న మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. కరీంనగర్‌‌‌‌, నిజామాబాద్‌‌లో బీజేపీ మూడో స్థానానికి పడిపోగా, ఆదిలాబాద్‌‌లో రెండో స్థానంలో ఉంది. ఈ లెక్కన పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ స్థానాలను కాపాడుకోవడం కూడా బీజేపీకి సవాల్‌‌గా మారనున్నది. 

మరోవైపు, ప్రజల నమ్మకం కోల్పోయి ప్రతిపక్షంలోకి వెళ్లిన బీఆర్‌‌‌‌ఎస్.. పార్టీ నుంచి నాయకుల జంపింగ్‌‌లతో ఇబ్బంది పడుతోంది. పార్టీ ముఖ్య నాయకుల చుట్టూ అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసులు చుట్టుముడుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇవన్నీ కాంగ్రెస్‌‌కు కలిసొచ్చే అంశాలుగా పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండటం, పార్లమెంట్​ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొస్తుందని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రులు 14  సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.