తిరువనంతపురం: కొందరు సినిమాలను, మీడియాను రాజకీయ ప్రాపగండా కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. సినిమాలు, మీడియా ప్రజలను ఏకం చేయాలి కానీ.. సమాజంలో విభజనలను సృష్టించకూడదని ఆయన ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు.
కేరళ స్టోరీ ప్రదర్శిస్తున్న థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయని, దీన్ని బట్టి కేరళ సంస్కృతి, సంప్రదాయాల గురించి దేశ ప్రజలకు ఎంతటి అవగాహన ఉందో అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేరళలోని ఇడుక్కిలో ఉన్న మరియన్ కాలేజీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖికి సంబంధించిన వీడియోను శనివారం ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఒక వర్గాన్ని కించపరచడానికి, సామాజిక విభజనలు సృష్టించడానికి సినిమా, మీడియాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా సాగిన ‘పుతుయుగ యాత్ర’ ముగింపు సభలో కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు.
ప్రధాని మోదీ.. అమెరికాతో ట్రేడ్ డీల్ తో దేశానికి ద్రోహం చేశారని విమర్శించారు. ఈ డీల్ వల్ల భారతదేశంలోని రైతులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆరోపించారు. అలాగే, ఈ ఒప్పందం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ డేటాను చేజిక్కించుకున్నారని, ఇంధన రంగం కూడా రాజీ పడిందని ఆరోపించారు.
