- కేరళం ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ విమర్శలు
- సీఎంగా మహిళను చూడాలనుకుంటున్నట్లు వెల్లడి
- విదేశీ నిధులు కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌కే ఎందుకని ఫైర్
తిరువనంతపురం: కేరళంలో బీజేపీ, అధికార ఎల్‌డీఎఫ్ పార్టీల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం వల్లే శబరిమల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదపడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ సోమవారం పథనంతిట్ట జిల్లాలో పర్యటించారు. అడూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ...‘‘ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా మతం, హిందూత్వం, దేవాలయాల గురించి మాట్లాడుతుంటారు. కానీ కేరళం పర్యటనలో మాత్రం శబరిమల అంశంపై ఆయన నోరు మెదపలేదు.
ఎల్‌డీఎఫ్ నేతలు అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారాన్ని తీసేసి ఇత్తడిని పెట్టారు. నాపై 36 కేసులు పెట్టి, 55 గంటల పాటు విచారించిన మోదీ ప్రభుత్వం.. శబరిమల బంగారం అంశంలో కేరళ సీఎంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు దర్యాప్తుకు ఆదేశించడం లేదు? ఎందుకంటే మోదీకి గుడులు, హిందూత్వం, భక్తి కంటే ఓట్లే ముఖ్యం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎల్‌డీఎఫ్ కలిసి పనిచేస్తున్నాయి.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమిని ఓడించేందుకు మోదీ ఎల్‌డీఎఫ్‌తో సీక్రెట్ ఒప్పందం చేసుకున్నారు. మేం అధికారంలోకి రాగానే శబరిమల అక్రమాలకు బాధ్యులైన వారిని శిక్షిస్తాం. రబ్బరు రైతులను, సామాన్యులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం" అని స్పష్టం చేశారు.
కేరళంకు మహిళను సీఎంగా చూడాలని ఉంది
కేరళం అభివృద్ధిలో మహిళలు క్రియాశీల భాగస్వాములు కావాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు రాహుల్ తెలిపారు. ‘‘వాస్తవానికి కేరళంకు సీఎంగా ఒక మహిళ ఉండే రోజుకోసం మేం ఎదురుచూస్తున్నాం’’ అని ఆయన చెప్పగానే జనం పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ, కేకలు వేశారు. కేరళంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సాయం అమలు చేస్తామని ప్రకటించారు.
విదేశీ నిధులు ఆర్‌ఎస్‌ఎస్ కే ఎందుకు..?
ఎఫ్‌సీఆర్‌ఏ(ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) సవరణ బిల్లు, ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అకస్మాత్తుగా ఒక ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లును తీసుకువచ్చారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆర్‌ఎస్‌ఎస్ తప్ప మరే ఇతర సంస్థ విదేశాల నుంచి నిధులు పొందే వీలు లేకుండా చేశారు. అసలు ఆర్‌ఎస్‌ఎస్‌కు మాత్రమే ప్రత్యేక నిబంధనలు ఎందుకు రూపొందించాలి? ఆర్‌ఎస్‌ఎస్ సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నది.
ప్రధాని మోదీ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ద్వారా విదేశీ ఆర్థిక వనరులను పొందుతున్నారు. కార్పొరేట్ సంస్థలు, ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ నేరుగా ప్రయోజనం పొందుతోంది. కేంద్రం విధానాలన్నీ సామాన్యులకు కాకుండా, ఇలాంటి శక్తులకే మేలు చేస్తున్నాయి. బీజేపీ పనితీరు ఇలాగే ఉంటుంది" అని రాహుల్ గాంధీ విమర్శించారు.
