- సహజ సిద్ధమైన ప్రకృతి సంపద త్వరలోనే నాశనం కాబోతున్నది: రాహుల్‌గాంధీ
- ఆ ఆలోచనే నన్ను కలిచివేస్తున్నది.. కేంద్రానికి పర్యావరణంపై అవగాహన లేదు
- దీన్ని దేశ రక్షణ ప్రాజెక్టుగా చెబుతున్నది.. కానీ అది పచ్చి అబద్ధం
- పగడపు దీవులను నాశనం చేస్తున్నరు
- ప్రాజెక్టు కోసం గిరిజనుల భూములను లాక్కుంటున్నరు
- పర్యావరణ పరిరక్షణకు దేశ యువత పోరాడాలని పిలుపు
- గ్రేట్ నికోబార్ పరిధిలోని సముద్ర గర్భంలో రాహుల్ స్కూబా డైవింగ్ వీడియో ‘ఎక్స్’లో పోస్ట్
పోర్ట్‌బ్లెయిర్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టు’పై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్టు వల్ల అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ ఎత్తున పర్యావరణ విధ్వంసం జరుగుతోందని, ఒక వ్యాపారవేత్త లాభం కోసం మోదీ సర్కారు గ్రేట్ నికోబార్ దీవిలోని 1.5 కోట్లకుపైగా చెట్లను, పగడపు దిబ్బలను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.
తన అండమాన్ పర్యటనకు సంబంధించిన వివరాలతో కూడిన 16 నిమిషాల నిడివి గల ఒక ప్రత్యేక వీడియోను రాహుల్ గాంధీ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆయన గ్రేట్ నికోబార్ పరిధిలోని సముద్ర గర్భంలోకి వెళ్లి, అక్కడి పగడపు దీవులను (కోరల్ రీఫ్స్) పరిశీలిస్తూ స్కూబా డైవింగ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇంతటి సహజ సిద్ధమైన ప్రకృతి సంపద త్వరలోనే నాశనమైపోబోతోందనే ఆలోచనే తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆయన ఆన్‌లైన్ లో దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు.
కేంద్రానికి అవగాహన లేదు..
వీడియోలో రాహుల్ గాంధీ తన పర్యటన అనుభవాలను పంచుకుంటూ.. ‘‘ఇంతటి అద్భుతమైన ప్రకృతిని రాబోయే రోజుల్లో ధ్వంసం చేయబోతున్నారనే విషయం నన్ను తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది. దేశ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతిని చూడాలని నేను కోరుకుంటున్నాను. అసలు ఇక్కడి పర్యావరణ ప్రాముఖ్యత ఏంటో ప్రజలకు అర్థం కావడంలేదు.. అంతకంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి అస్సలు అవగాహన లేదు’’ అని వ్యాఖ్యానించారు.
తాను అండమాన్ , నికోబార్ దీవుల్లో పర్యటించానని, ముఖ్యంగా నికోబార్ ప్రాంతంలో ఎంతో స్వచ్ఛమైన అడవులను, పగడపు జీవవ్యవస్థలను స్వయంగా పరిశీలించానని తెలిపారు. అక్కడ నివసిస్తున్న స్థానిక ప్రజలతో, గిరిజన తెగల ప్రతినిధులతో తాను మాట్లాడానని చెప్పారు. ఇక్కడ ప్రతిపాదించిన భారీ స్థాయి అభివృద్ధి పనుల వల్ల ప్రకృతికి కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని రాహుల్ హెచ్చరించారు. ‘‘మేం అండమాన్, నికోబార్‌కు వెళ్లాం. అండమాన్‌లో ఒక రోజంతా గడిపాం.
అక్కడ స్కూటర్ పై తిరుగుతూ స్థానిక ప్రజలను, పర్యాటకులను కలిశాం. వారితో మాట్లాడాం. అండమాన్ దీవుల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేం 100% మద్దతు ఇస్తాం” అని స్పష్టం చేశారు. ఈ దీవులు ప్రపంచం ఇంతవరకూ చూడని అత్యంత అసాధారణమైన సుస్థిర గమ్యస్థానాలుగా మారుతాయని, అలాంటి భారతదేశం కోసమే పోరాడాలని చెప్పారు. ఈ పర్యావరణ విధ్వంసాన్ని ఆపగల శక్తి కేవలం యువతకే ఉందని, ఈ పోరాటంలో వారు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీ కంటే నాలుగు రెట్లు పెద్దది
ఈ ప్రాజెక్టు పరిమాణాన్ని వివరిస్తూ రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘61 చదరపు కిలోమీటర్లు! దయచేసి దీన్ని అర్థం చేసుకోండి, ఇది మన దేశ రాజధాని ఢిల్లీ కంటే నాలుగు రెట్లు పెద్దది. మన దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన, సున్నితమైన పర్యావరణ వ్యవస్థ కలిగిన ప్రాంతంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అక్కడ ఎప్పుడో స్థిరపడిన వారి నుంచి, శతాబ్దాలుగా నివసిస్తున్న స్థానిక గిరిజనుల నుంచి భూములను లాక్కుంటున్నారు’’ అని ఆరోపించారు.
భారీ నిర్మాణాల వల్ల సముద్ర గర్భంలోని పగడపు దీవులు నాశనం అవుతాయని, జీవవైవిధ్యం దెబ్బతినడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను పీల్చుకునే సముద్ర సామర్థ్యం తగ్గిపోతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు అమలులో అడవుల హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ)ను తీవ్రంగా ఉల్లంఘించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిని దేశ రక్షణ ప్రాజెక్టుగా మోదీ ప్రభుత్వం చెబుతున్నదని, కానీ అది పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. భారత్ ఇప్పటికే కేరళలో ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్టును నిర్మిస్తోందని, ఈ దీవుల్లో మరో భారీ పోర్టు అవసరంలేదని పేర్కొన్నారు.
