ఆపరేషన్ సిందూర్ గురించి పాక్కు ముందే ఎందుకు చెప్పారు: రాహుల్ గాంధీ

ఆపరేషన్ సిందూర్ గురించి పాక్కు ముందే ఎందుకు చెప్పారు: రాహుల్ గాంధీ

ఆపరేషన్ సిందూర్ వ్యవహారంలో కాంగ్రెస్ నేత, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ  సంధించిన ప్రశ్నలు కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టాయి. భారత్ చేపట్టబోయే ఆపరేషన్ గురించి పాకిస్తాన్ కు ముందుగా ఎలా చెప్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు రాహుల్. ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇండియా దాడి చేస్తుందని ముందుగానే పాకిస్తాన్ కు చెప్పడం నేరమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

ఆపరేషన్ సిందూర్ గురించి పాకిస్తాన్ కు ముందుగానే చెప్పినట్లు విదేశాంగమంత్రి జైశంకర్ ప్రకటించడంపై రాహుల్ సీరియస్ అయ్యారు. ఈ ఆపరేషన్ లో ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ లు ధ్వంసం అయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ గురించి ముందే చెప్పటం వలన భారత్ తీవ్రంగా నష్టపోయింది. భారత్ తీసుకోబోయే చర్యపై లీకులు ఇవ్వాల్సిందిగా ఎవరు ఆదేశించారో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.

‘‘ఉగ్ర స్థావరాలపై దాడి చేస్తున్నామని చెప్పడం నేరం. కేంద్ర ప్రభుత్వం ఈ దాడి గురించి ముందే పాక్ కు చెప్పిందని విదేశాగ మంత్రి ప్రకటించారు. దీనిని ఎవరు ధృవీకరించారు. తత్ఫలితంగా మన ఎయిర్ ఫోర్స్ ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ లను కోల్పోయింది’’ అని ఎక్స్ లో ప్రశ్నించారు. 

పాక్ గడ్డపై భారత్ దాడికి దిగబోతోందని ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు రాహుల్ గాంధీ. పాక్ ఉగ్రస్థావరాలపై భారత్  దాడి చేయబోతుందని, ఆర్మీ బేస్ లపై కాదని క్లియర్ మెసేజ్ ఇచ్చినట్లు జైశంకర్ మాట్లాడటం వీడియోలో వినవచ్చు. 

‘‘ఆపరేషన్ స్టార్ట్ అయ్యే ముందు పాకిస్తాన్ కు సమాచారం ఇచ్చాం. మిలిటరీపైన కాకుండా మేము ఉగ్రస్థావరాలపై దాడి చేస్తున్నాం. అందువలన ఈ దాడిలో తల దూర్చకుండా దూరంగా ఉండేందుకు మిలిటరీకి ఆప్షన్ ఉంది. కానీ వాళ్లు మా మంచి సలహాను స్వీకరించలేదు’’ అని జైశంకర్ ప్రెస్ ముందు మాట్లాడటం వీడియోలో గమనించవచ్చు. 

ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పహల్గాం దాడిలో 26 మంది అమాయకు టూరిస్టులను పొట్టనపెట్టుకున్నారు ఉగ్రవాదులు. దీంతో భారత్ టెర్రర్ క్యాంపులను ధ్వంస చేసింది. పాక్ ఆర్మీ కూడా దాడికి దిగడంతో భారత్ ధీటుగా స్పందించి ఆర్మీ బేస్ క్యాంపులను కూడా ధ్వంసం చేసింది. ఈ దాడిలో వందల మంది టెర్రరిస్టులు హతమయ్యారు.