‘‘నాకు తెలంగాణ ప్రజలతో ఉన్న సంబంధం రాజకీయాలకు అతీతం. మనందరిదీ కుటుంబ ఆత్మీయ బంధం” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం తుక్కుగూడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జన జాతర సభలో కాంగ్రెస్ జాతీయస్థాయి మేనిఫెస్టో ‘న్యాయపత్రం’ను రాహుల్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీకు సోనియమ్మ మద్దతు ఉంది. తెలంగాణ ప్రజల సిఫాయిలా ఢిల్లీలో ఉంటా. నా జీవితాంతం చిన్న పిల్లలు పిలిచినా తెలంగాణ వస్తా. ప్రజల స్వప్నం సాకారం చేసేందుకు రాష్ట్రాన్ని ఇచ్చాం. ఈ కొత్త రాష్ట్రం దేశానికే మార్గం చూపాలి. నేను, సీఎం, కార్యకర్తలు అందరం కలిసి పని చేస్తాం” అని అన్నారు.
బీజేపీకి భయపడం
దేశంలో ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలు సృష్టిస్తున్నదని, కొట్లాటలు పెడుతున్నదని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ‘‘తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు కలిసి కట్టుగా పనిచేస్తూ తమ ఐక్యతా సందేశాన్ని దేశం మొత్తానికి అందిస్తున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. దళితులు, ఆదివాసీ, బీసీలు ఇలా అన్ని వర్గాలను రాజ్యాంగం రక్షిస్తున్నది. రాజ్యాంగాన్ని రద్దు చేయనీయం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని బ్యాంకు అకౌంట్లను బీజేపీ మూసేయించింది. అయినా మేం భయపడం” అని ఆయన స్పష్టంచేశారు.