
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలు జాతీయ సర్వే సంస్థలు..తెలంగాణ ఎన్నికల పోలింగ్ పై ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ .. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతున్నట్లు వెల్లడించాయి. ఈ క్రమంలో అటు బీఆర్ఎస్ నేతలు.. ఇటు కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై ఎన్నికలపై ఫలితాలపై చర్చించుకుంటున్నారు.
తాజాగా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తెలంగాణ ముఖ్య నేతలతో చర్చించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 2వ తేదీ శనివారం సాయంత్రం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలతో జూమ్ మీటింగ్ లో మాట్లాడనున్నారు. ఎన్నికల ఫలితాలు.. పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో రాహుల్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి జార్జ్ లు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. మరోవైపు, కేసీఆర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు టచ్ లోకి వచ్చారని డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అభ్యర్థులే ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారని.. ఈసారి మా ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు లొంగేందుకు సిద్ధంగా లేరని.. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారని తెలిపారు. క్యాంపు రాజకీయాలు చేయాల్సిన అవసరం రాదని.. భారీ మెజార్టీతోనే కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డీకే శివకుమార్ చెప్పారు.