చిక్కడపల్లిలో టీ స్టాల్ వద్ద నిరుద్యోగులతో రాహుల్​గాంధీ మాటముచ్చట

చిక్కడపల్లిలో టీ స్టాల్ వద్ద నిరుద్యోగులతో రాహుల్​గాంధీ మాటముచ్చట
  •    ధైర్యం కోల్పోవద్దు.. అండగా ఉంటం
  •     కాంగ్రెస్​ వస్తే ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తం
  •     నిరుద్యోగులకు రాహుల్​గాంధీ భరోసా
  •     చిక్కడపల్లి సిటీ సెంట్రల్​ లైబ్రరీ వద్ద నిరుద్యోగులతో ముచ్చట

ముషీరాబాద్, వెలుగు: నిరుద్యోగులు ధైర్యం కోల్పోవద్దని, అండగా ఉంటామని కాంగ్రెస్​ ముఖ్యనేత రాహుల్​గాంధీ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్​ క్యాలెండర్​ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం రాత్రి 8.30 గంటలకు  రాహుల్​గాంధీ అకస్మాత్తుగా హైదరాబాద్​లోని చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీ వద్దనున్న టీ స్టాల్ వద్దకు చేరుకున్నారు. కారు దిగి  ఎలాంటి హడావుడి లేకుండా నడుచుకుంటూ వచ్చి.. అక్కడ నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతతో చాయ్​ తాగుతూ ముచ్చటించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ నిరుద్యోగ సమస్య ఎందుకు ఇంతలా ఉందని అడిగారు.

ఈ సందర్భంగా నిరుద్యోగ యువత మాట్లాడుతూ.. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేసి తమ జీవితాలతో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఆడుకున్నదని అన్నారు. ‘‘నిరుద్యోగులంతా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పటికీ టీఎస్​పీఎస్సీ మా ఆశలను వమ్ము చేసింది. కొట్లాడి తెలంగాణ సాధించుకున్నా.. మాకు ఉద్యోగాలు దక్కడం లేదు. గ్రూప్​ 1 పరీక్ష రెండు సార్లు రద్దయింది” అని రాహుల్​ దృష్టికి తీసుకెళ్లారు.

కోచింగ్ లు, తదితర వాటికి ఒక్కొక్కరికీ ప్రతినెల పదివేల రూపాయలకుపైనే  ఖర్చవుతున్నదని, ఈ వయసులో కూడా తల్లిదండ్రులకు భారంగా ఉండాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాక ప్రాణాలు కోల్పోయే దుస్థితి వచ్చిందని వాపోయారు. దీంతో స్పందించిన రాహుల్ గాంధీ.. ధైర్యాన్ని కోల్పోవద్దని, కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, నిరుద్యోగుల కలలు నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. అయితే.. అక్కడ  రాహుల్​గాంధీ మీడియాతో మాట్లాడుకుండానే వెళ్లిపోయారు.

అనంతరం తెలుగులో ట్విట్టర్​లో పోస్ట్​ పెట్టారు. ‘‘హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో వివిధ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న యువతను కలిశాను. తెలంగాణ వస్తే తమకు కొలువులు వస్తాయని ఆశించామని, రాష్ట్రం వచ్చి పదేండ్లయినా తమ ఆకాంక్షలు నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేయడం నన్ను కలిచివేసింది. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు.

30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు. వారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనే వారికి కొలువులు రాని దుస్థితి. అందుకే వారి కలలు సాకారం అయ్యేలా.. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జాబ్ క్యాలెండర్​ను వారికి చూపించి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం” అని అందులో రాహుల్​ పేర్కొన్నారు.