
- కాళేశ్వరం పేరు చెప్పి కేసీఆర్ దోచుకున్నరని మండిపాటు
- నాసిరకం పనుల వల్లే పిల్లర్లు కుంగాయని ట్వీట్
- అంతకుముందు అంబటిపల్లిలో మహిళా సదస్సుకు హాజరు
జయశంకర్ భూపాలపల్లి/ మహాదేవ్‌పూర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్‌గాంధీ మేడిగడ్డ బ్యారేజీకి వెళ్లారు. అక్కడ కుంగిన పిల్లర్లను పరిశీలించి.. తన సెల్ ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీశారు. నదిపై కట్టిన బ్యారేజీ కేవలం నాలుగున్నరేండ్లలోనే భూమిలోకి కుంగడమేందని ఇంజనీర్లను ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఫ్యామిలీకి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని, నాసిరకం పనుల కారణంగానే పిల్లర్లు కుంగాయని రాహుల్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి తెలియాలంటే కాళేశ్వరం ప్రాజెక్టును చూడాలంటూ ఇటీవల మంత్రి కేటీఆర్ చాలెంజ్ విసరగా.. రాహుల్‌గాంధీ స్వీకరించారు. ప్రాజెక్టులో భాగమైన భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని గురువారం ఉదయం ఆయన పరిశీలించారు. అంతకుముందు పక్కనే ఉన్న అంబటిపల్లి గ్రామంలో మహిళా సదస్సులో పాల్గొని మాట్లాడారు.
గ్రామ సమీపంలో భూమిలోకి కుంగిపోయిన బ్యారేజీ పిల్లర్లను పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి రాహుల్సందర్శించారు. దాదాపు 15 నిమిషాలు బ్యారేజీని పరిశీలించారు. కుంగిన పిల్లర్లను ఆయన చూసి.. అందుకు కారణాలను అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు కేరాఫ్‌గా మారిందని ఆరోపించారు.
ప్రజా సంపదను కేసీఆర్ దోచుకున్నడు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన కోట్లాది అవినీతిని కండ్లారా చూసేందుకే తాను ఇక్కడికి వచ్చానని రాహుల్ తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ముందు ఆయన పక్కనే ఉన్న అంబటిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘‘సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్పి ప్రజా సంపదను దోచుకున్నరు. ఆయన దోచుకున్న సొమ్మును రాష్ట్రంలో మా సర్కారు వచ్చిన వెంటనే కక్కిస్తం. ఆ సొమ్మంతా ప్రజలకే పంచిపెడ్తం” అని చెప్పారు. ‘‘అసెంబ్లీ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నయ్. కేసీఆర్ సర్కార్ రాష్ట్ర సంపదను దోచుకుని తెలంగాణలో ప్రతి కుటుంబంపై అప్పుల భారాన్ని మోపింది” అని మండిపడ్డారు. తెలంగాణలో పూర్తిగా నష్టపోయింది మహిళలేనని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు ప్రతి నెల ఒకటో తారీఖున రూ. 2,500 వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. మోదీ, కేసీఆర్ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 12 వందలకు చేరిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. అదేవిధంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కుట్రలు పన్నుతున్నాయని, కాంగ్రెస్ ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు.
బ్యారేజీని సగం కూల్చాల్సిందే: రేవంత్ రెడ్డి
చాలా పిల్లర్లు భూమిలోకి కుంగడం వల్ల మేడిగడ్డ బ్యారేజీ సగం కూల్చాల్సిన పరిస్థితి వచ్చిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్‌తో కలిసి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ఎంత అవినీతికి పాల్పడినా బీజేపీ కాపాడుతున్నదని, ఈ రెండు పార్టీల అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు, దాని పరిధిలోని బ్యారేజీలు బలవుతున్నాయని దుయ్యబట్టారు. ‘‘కేసీఆర్ అంటే ఇంతకాలం ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పుకున్నరు. ఇప్పుడు కాళేశ్వరం కరప్షన్ రావు అని పిలుచుకునే పరిస్థితి వచ్చింది” అని అన్నారు. నాసిరకం పనులతో లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందని, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయని తెలిపారు. 25వ పిల్లర్ నుంచి 1వ పిల్లర్ వరకు పూర్తిగా కుంగిపోయిందని అన్నారు. పిల్లర్లు రెండున్నర ఫీట్లు కుంగిపోయిందని ఆఫీసర్లే స్వయంగా చెప్తున్నారని, ప్రాజెక్టును నిర్మించిన ఎల్‌అండ్‌టీ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధిత ఇంజనీర్లు, సీడీవోపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించి తీరుతామని చెప్పారు. మేడిగడ్డను పరిశీలించినవాళ్లలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తదితరులు ఉన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ వద్ద తోపులాట.. పలువురికి గాయాలు
మేడిగడ్డ బ్యారేజీ వద్ద తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. బ్యారేజీ దగ్గరికి రాహుల్ గాంధీ వెళ్తుండగా పోలీసులు బారీకేడ్లు పెట్టి కార్యకర్తలను వెళ్లకుండా అడ్డుకున్నారు. అంబటిపల్లి అంబేద్కర్ చౌక్ వద్ద రాహుల్ కాన్వాయ్ ని పంపించిన పోలీసులు.. కాంగ్రెస్ కార్యకర్తలను, లోకల్ లీడర్లను ఆపేశారు. దీంతో తమను కూడా మేడిగడ్డ బ్యారేజీ వరకు వెళ్లడానికి అనుమతించాలని పోలీసులను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కోరారు. పోలీసులు అనుమతించకపోవడంతో.. కొందరు కార్యకర్తలు బారీకేడ్లను తోసుకొని బ్యారేజీ వైపు పరుగులు తీశారు. వందల సంఖ్యలో కార్యకర్తలు బ్యారేజీ వైపు వస్తుండటంతో పోలీసులు మధ్యలో రెండుసార్లు ఆపడానికి ప్రయత్నించారు. సీఆర్‌ఆర్పీఎఫ్ బలగాలు బ్యారేజీ చెక్ పోస్ట్ వద్ద కార్లను అడ్డుగా పెట్టి ముందుకు ఎవరిని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇక్కడ తోపులాట జరిగింది. మహదేవ్పూర్ సీఐ కిరణ్ కాలికి దెబ్బ తగిలింది. అలాగే పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు.
కాళేశ్వరం కరప్షన్ రావు.. బై బై
తెలంగాణలో అవినీతికి కేంద్రంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించాను. క్వాలిటీ లేని పనుల కారణంగా పలు పిల్లర్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అవి కుంగిపోతున్నాయి. తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఏటీఎంగా వాడుకుంటున్నది. కాళేశ్వరం కరప్షన్ రావు.. బై బై కేసీఆర్.
- ట్విట్టర్లో రాహుల్ గాంధీ