మీ ధైర్యానికి సెల్యూట్..దేశభక్తితో యుద్ధ భారం మోస్తున్నారు: రాహుల్ గాంధీ

మీ ధైర్యానికి సెల్యూట్..దేశభక్తితో యుద్ధ భారం మోస్తున్నారు: రాహుల్ గాంధీ
  • దేశభక్తితో యుద్ధ భారం మోస్తున్నారు: రాహుల్
  • పూంఛ్​లో బాధిత కుటుంబాలకు పరామర్శ  
  • అండగా ఉంటానని హామీ 
  • దెబ్బతిన్న ఇండ్లు, ప్రార్థనా స్థలాల పరిశీలన

పూంచ్:  బార్డర్‌‌‌‌లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో చనిపోయినోళ్ల కుటుంబాలకు అండగా ఉంటానని లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. వాళ్ల సమస్యను జాతీయ స్థాయిలో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలు ఎంతో ధైర్యంతో యుద్ధ భారాన్ని మోస్తున్నాయని, వాళ్లకు ‘నా సెల్యూట్’ అని తెలిపారు. శనివారం జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని పూంచ్‌‌లో రాహుల్ పర్యటించారు. ఇటీవల బార్డర్ వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో చనిపోయినోళ్ల కుటుంబాలను పరామర్శించారు. పాక్ షెల్లింగ్‌‌లో దెబ్బతిన్న ఇండ్లను, ప్రార్థనా స్థలాలను పరిశీలించారు. దాదాపు గంటకు పైగా బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ఇదొక తీవ్ర విషాదం. పాకిస్తాన్ నేరుగా జనావాసాలనే టార్గెట్‌‌ చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలతో నేను మాట్లాడాను. వాళ్ల బాధను అర్థం చేసుకున్నాను. తమ సమస్యను జాతీయ స్థాయిలో లేవనెత్తాలని వాళ్లు కోరారు. తప్పకుండా ఆ పని చేస్తాను” అని తెలిపారు. ఆ తర్వాత సోషల్ మీడియా ‘ఎక్స్‌‌’లోనూ రాహుల్ పోస్టు పెట్టారు.

 ‘‘పూంచ్‌‌లో పాక్ జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినోళ్ల కుటుంబాలను ఈరోజు కలిశాను. దెబ్బతిన్న ఇండ్లు, చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు, చెమ్మగిల్లిన కండ్లను చూశాను. ఆత్మీయులను కోల్పోయిన బాధాకరమైన కథలు విన్నాను. దేశభక్తి కలిగిన ఈ కుటుంబాలు.. ప్రతిసారీ ఎంతో ధైర్యం, గౌరవంతో యుద్ధ భారాన్ని మోస్తున్నాయి. వాళ్ల ధైర్యానికి నా సెల్యూట్. ఈ బాధిత కుటుంబాలకు నేను అండగా ఉంటాను. వాళ్ల సమస్యను జాతీయ స్థాయిలో లేవనెత్తుతాను” అని పోస్టులో రాహుల్ పేర్కొన్నారు. కాగా, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ బార్డర్‌‌‌‌లో కాల్పులు జరిపి 28 మందిని బలితీసుకుంది. 

స్టూడెంట్లకు ధైర్యం.. 

రాహుల్ తన పర్యటనలో భాగంగా పూంచ్‌‌ టౌన్‌‌లోని క్రైస్ట్‌‌ స్కూల్‌‌కు వెళ్లారు. ఈ స్కూల్‌‌లో చదువుకుంటున్న 12 ఏండ్ల కవల పిల్లలు జైన్ అలీ, ఉర్వా ఫాతిమా పాక్ జరిపిన కాల్పుల్లో చనిపోయారు. ఈ నేపథ్యంలో రాహుల్‌‌ స్కూల్‌‌కు వెళ్లి తోటి స్టూడెంట్లకు ధైర్యం చెప్పారు. ‘‘మీరు ప్రమాదాన్ని చూశారు. భయానక పరిస్థితులను చూశారు. కానీ భయపడకండి.. బాధపడకండి. మళ్లీ అంతా సర్దుకుంటుంది. సాధారణ స్థితికి చేరుతుంది. ఈ సమస్యకు మీరు చేయాల్సిందల్లా.. కష్టపడి చదవండి, కష్టపడి ఆడండి, ఎక్కువ మంది స్నేహితులను చేసుకోండి. ఓకేనా.. మీరంతా చేస్తారు.. నాకు తెలుసు” అని పిల్లలతో రాహుల్ అన్నారు. ఇక స్కూల్ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు ‘‘అందరికీ బిగ్ హగ్. లవ్ యూ.. థ్యాంక్యూ” అని చెప్పారు. కాగా, పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత రాహుల్ జమ్మూకాశ్మీర్ వెళ్లడం ఇది రెండోసారి. గత నెల 22న దాడి జరగ్గా, ఆయన 25న శ్రీనగర్ వెళ్లారు. ఉగ్రదాడిలో గాయపడినోళ్లను పరామర్శించారు. మళ్లీ ఇప్పుడు శనివారం  పూంచ్‌‌లో బాధిత కుటుంబాలకు వెళ్లి పరామర్శించారు.

రాహుల్‌‌కు నాన్‌‌ బెయిలబుల్ వారెంట్

న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జార్ఖండ్‌‌లోని ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సెషన్‌‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆనాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై పలు కామెంట్లు చేశారు. దీంతో రాహుల్‌‌పై బీజేపీ లీడర్ ప్రతాప్ కటియార్ పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ కేసును రాంచీలోని ఎంపీ–ఎమ్మెల్యే కోర్టుకు 2020లో హైకోర్టు బదిలీ చేసింది. ఆ తర్వాత మళ్లీ చాయ్‌‌బాసాలోని ఎంపీ–ఎమ్మెల్యే కోర్టుకు రిఫర్ చేసింది. తాజాగా దీనిపై కోర్టు విచారణ చేపట్టింది.