
రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. బిష్ణుపూర్ వద్ద పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. 2023 జూన్ 29 గురువారం ఇంఫాల్ కు చేరుకున్న రాహుల్ ఆ వెంటనే చురాచాంద్‌పుర్ జిల్లాకు బయలుదేరారు. అయితే, రాహుల్ అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మార్గం మధ్యలోనే ఆయన కాన్వాయ్‌ను నిలిపివేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించగా, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు విసిరారు.
చురాచాంద్‌పుర్‌కు రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్‌లో వెళ్లాలని రాహుల్ కు సూచించామని పోలీసులు అన్నారు. హింసాత్మక ఘటనలు పునరావృతమవుతాయని తాము ఆందోళన చెందామని, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా.. ఆయన కాన్వాయ్‌ను బిష్ణుపుర్‌లో ఆపివేయాలని కోరామని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. పోలీసులు సూచన మేరకు రాహుల్ తిరిగి ఇంఫాల్ బయల్దేరారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో చురాచాంద్‌పుర్ వెళ్లనున్నారు.
కాగా మైతేయ్‌లకు ఎస్టీహోదాను వ్యతిరేకిస్తూ కుకీలు మే 3న నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ ర్యాలీ’ తీవ్ర ఘర్షణకు దారితీసింది. అప్పటి నుంచి హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటివల్ల 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 300 శిబిరాల్లో 50 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు. రాహుల్ గాంధీ చురాచాంద్‌పుర్ శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలను పరామర్శించనున్నారు.