
రాహుల్‌గాంధీ జనంలో కూర్చుని సినిమా చూసిన వీడియో సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్ పదవికి రిజైన్ చేసిన రాహుల్… బుధవారం ఢిల్లీలోని ఓ థియేటర్‌లో ‘ఆర్టికల్ 15’ సినిమా చూశారు. పాప్ కార్న్ తింటూ, పక్క సీట్లోని వారితో సరదాగా కబుర్లు చెబుతూ కనిపించారు. థియేటర్‌లోని ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యారు. సింపుల్‌గా అందరిమధ్యా కూర్చుని సినిమా చూడడడం గొప్ప విషయమని కొందరంటే.. కొత్త చీఫ్ గా ఎవర్ని ఎన్నుకోవాలని నాయకులు తర్జనభర్జన పడుతుంటే రాహుల్ మాత్రం కూల్‌గా రిలాక్స్ అవుతున్నారని మరికొంతమంది కామెంట్ చేశారు.
యంగ్ లీడర్ రావాలి: పంజాబ్ సీఎం
కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ గాంధీ స్థానంలో యంగ్ లీడర్‌కు అవకాశం కల్పించాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. యువ నేతలు ఆ ప్లేస్‌ను భర్తీచేస్తేనే వందేళ్ల పార్టీకి పాత వైభవం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. రాహుల్‌గాంధీ రాజీనామా తర్వాత.. ముందుచూపున్న యంగ్ లీడర్ మాత్రమే పార్టీని ఏకతాటిపైకి తేగలరని సీఎం అమరీందర్ శనివారం ఒక ప్రకటనలో వివరించారు. దేశానికి పరిచయమున్న వ్యక్తి, ప్రజలతో సంబంధాలున్న కరిష్మా ఉన్న కొత్త జనరేషన్ లీడర్ కి మాత్రమే రాహుల్ ప్లేస్‌లో అవకాశం కల్పించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఆయన విజ్ఞప్తి చేశారు. యువకులు పార్టీ పగ్గాలు చేపడితే దాన్ని ఎలా ముందుకు తీసుకెళతారో రాహుల్ నిరూపించారని అమరీందర్ అన్నారు. దేశ జనాభాలో 35 ఏళ్ల కన్నా తక్కువ వయసున్నవాళ్లు 65% ఉన్నందువల్ల.. పార్టీ నాయకత్వం కూడా సమాజంలో చోటుచేసుకున్న పరిణామాలకు అనుగుణంగా మారాల్సి ఉందన్నారు. ‘‘రాజీనామా నిర్ణయంపై రాహుల్ వెనక్కి తగ్గకపోవడం పార్టీకి పెద్ద నష్టం. కోలుకోలేని దెబ్బ. మరో యంగ్ లీడర్ ను ఆయన ప్లేస్‌లో నియమించినప్పుడే పార్టీ ఆ లోటును రికవరీ చేసుకుంటుంది’’ అని పంజాబ్ సీఎం అన్నారు. కొత్త నేత ఎంపిక విషయంలో పార్టీ సీనియర్లు సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అమరీందర్ సింగ్ చెప్పారు.