టెక్సాస్: 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత భారతదేశంలోని ప్రజలకు మోదీపై.. బీజేపీపై ఉన్న భయం పోయిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. సోమవారం టెక్సాస్లోని భారతీయ ఎన్నారైలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భారత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సొంతంగా రాకపోవడంతో ప్రధాని మోడీపై, ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న భయం పోయిందని అన్నారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన నిమిషాల్లోనే ఈ విషయాన్ని మేం గ్రహించామని రాహుల్ పేర్కొన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల రిజల్ట్స్ తనకు లేదా కాంగ్రెస్ పార్టీకి విజయం కాదని, భారత ప్రజల అభీష్టానికి అద్దం పట్టాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను అణగదొక్కడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించారని.. మా మతంపై, మా రాష్ట్రంపై దాడిని మేము అంగీకరించబోము నొక్కి చెప్పారని అన్నారు. భారతదేశం ఒకటే ఆలోచన అని బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ నమ్ముతుంది. కానీ భారతదేశం అనేక ఆలోచనలని మేము నమ్ముతున్నామని కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్న సైద్దాంతిక విభేదాలను వివరించారు.
Also Read :- డాక్టర్ల ధర్నా వల్ల 23 మంది రోగులు చనిపోయారు..!
తన దృష్టిలో కులం, మతం, భాష లేదా సంప్రదాయంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యమే భారతదేశం అని అన్నారు. రాజ్యాంగంపై ప్రధాని మోడీ దాడి చేస్తున్నారని భారతదేశంలోని మిలియన్ల మంది ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారని.. ఎన్నికలలో ఈ విషయం స్ఫటికమైందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని ఎన్నికల్లో తాను లేవనెత్తిన అంశం ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారని అన్నారు. మన రాజకీయ వ్యవస్థలలో, పార్టీలలో లేనిది ప్రేమ, గౌరవం, వినయం అని నేను భావిస్తున్నాను. దీంతోనే దేశ రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయం యొక్క విలువలను తీసుకురావడం తన లక్ష్యమని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.