కోల్ కతా కేసు: డాక్టర్ల ధర్నా వల్ల 23 మంది రోగులు చనిపోయారు..!

కోల్ కతా కేసు: డాక్టర్ల ధర్నా వల్ల 23 మంది రోగులు చనిపోయారు..!

 కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు విచారణ సుప్రీంకోర్టులో సాగుతుంది. ఈ కేసుకు సంబంధించి.. కొత్త చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. ఈ నివేదిక ప్రకారం.. కొత్త విషయం తెరపైకి వచ్చింది. ట్రైనీ డాక్టర్ అంశంపై డాక్టర్లు ధర్నాలు, ర్యాలీలు, విధుల బహిష్కరణ చేశారు. ఈ క్రమంలోనే 23 మంది రోగులు చనిపోయినట్లు సీబీఐ తన నివేదికలో స్పష్టం చేసింది.

Also Read:-క్లీన్ ఎయిర్ సిటీల్లో దేశంలోనే నల్గొండ సెకండ్

 కోల్ కతాలోని ఆర్జీ‎కర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెస్ట్ బెంగాల్‎తో పాటు యావత్ దేశంలో సంచలనంగా రేపింది. దీంతో ఈ కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ట్రైనీ డాక్టర్‎పై హత్యాచారం ఘటనను సీరియస్ తీసుకున్న సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని రంగంలోకి దించింది. ఈ ఘటనపై వీలైనంత త్వరగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. 

ఈ క్రమంలో ఇవాళ (సెప్టెంబర్ 9) సుప్రీంకోర్టు సీజే బెంచ్ ఈ కేసుపై విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టగా.. సీబీఐ కేసు దర్యాప్తుకు సంబంధించిన లేటేస్ట్ స్టేటస్ రిపోర్ట్‎ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికలో సీబీఐ పలు కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది.

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి నిరసనగా కోల్ కతాతో పాటు దేశవ్యాప్తంగా డాక్టర్లు, జూనియర్లు వైద్యులు విధులు బహిష్కరించి బాధితురాలికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేశారు. బాధితురాలికి మద్దతుగా విధులు బహిష్కరించి డాక్టర్లు చేసిన ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనల వల్ల 23 మంది రోగులు మృతి చెందినట్లు సీబీఐ నివేదికలో పేర్కొంది. సరైన సమయానికి వైద్యం అందకపోవడం వల్లే వీరు మృతి చెందినట్లు తెలిపింది. మరోవైపు ప్రముఖ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించారు.