న్యూఢిల్లీ:లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం కంటే రాహుల్ గాంధీ వెళ్లిపోవడమే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్రాబ్లంలా మారిందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. లోక్‌సభ ఎన్నికలైన వెంటనే రాహుల్ తప్పుకోవడంతో ఆయన రాజీనామానే చర్చనీయాంశమైందని, నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా ఫలితాలపై పార్టీలో చర్చ జరగలేదని చెప్పారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.
‘‘రాహుల్ వెళ్లిపోవడంతో పార్టీలో ఖాళీ ఏర్పడింది. దాన్ని పూడ్చడానికి సోనియా తాత్కాలిక బాధ్యతలు తీసుకున్నారు. ఆమె ఫుల్‌టైమ్ చీఫ్‌గా కొనసాగితేనే పార్టీ బతుకుతుంది’’అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్న నేతలపై ఖుర్షీద్ మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వారా ఎన్నో లాభాలు పొంది, తీరా కష్టకాలంలో పార్టీని వీడటం దుర్మార్గమని, తాను మాత్రం చివరిదాకా కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఖుర్షీద్ చెప్పారు.

