అపరిశుభ్ర వాతావరణంలో  అల్లం, వెల్లుల్లి పేస్ట్

అపరిశుభ్ర వాతావరణంలో  అల్లం, వెల్లుల్లి పేస్ట్
  • 24 కంపెనీల్లో తనిఖీలు..17 కంపెనీలకు నోటీసులు
  • అపరిశుభ్ర వాతావరణంలో  అల్లం, వెల్లుల్లి పేస్ట్
  • బిస్కెట్ల తయారీలో  కలర్లు ఎక్కువ వాడుతున్నట్లు గుర్తింపు

శంషాబాద్, వెలుగు:  కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫుడ్ ఐటమ్స్ తయారీ కంపెనీలపై బల్దియా ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్​ పోలీసులతో కలిసి కాటేదాన్​లోని 24 కంపెనీల్లో తనిఖీలు చేసి రూల్స్, నాణ్యత పాటించని 17 కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. రవి ఫుడ్స్ బిస్కెట్లతయారీ కంపెనీతో పాటు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, చాక్లెట్లు, పల్లి పట్టి, కురుకురే తయారీ కంపెనీల్లో అధికారులుతనిఖీలు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో అల్లం,  వెల్లుల్లి పేస్ట్​తో పాటు ఇతర ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నట్లు  గుర్తించారు. బిస్కెట్ల తయారీలో కలర్లు ఎక్కువగా కలుపుతున్నట్లు తెలుసుకున్నారు. 17 కంపెనీల నుంచి శాంపిల్స్ సేకరించారు. తనిఖీల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జోనల్ ఆఫీసర్ జ్యోతిర్మయి, గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ ధర్మేందర్, డీసీపీ జగదీశ్వర్ రెడ్డి  పాల్గొన్నారు.

నాసిరకం ఐస్ క్రీమ్​ల తయారీ.. ఒకరు అరెస్ట్   

జీడిమెట్ల: క్వాలిటీ లేని ఐస్​క్రీమ్​లను తయారు చేస్తున్న వ్యక్తిని మేడ్చల్ ఎస్​వోటీ, పేట్​బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దూలపల్లికి చెందిన గొల్ల అంకయ్య ఎలాంటి పర్మిషన్ లేకుండా ‘డెయిరీ కూల్’ పేరుతో ఐస్ క్రీమ్​లు తయారు చేస్తున్నాడు. నాణ్యతను పాటించకుండా వాటిని తయారు చేసి అమ్ముతున్నాడు. దీని గురించి సమచారం అందుకున్న ఎస్ వోటీ పోలీసులు శనివారం అతడి గోడౌన్​పై దాడులు చేశారు. అంకయ్యను అదుపులోకి తీసుకున్నారు. రూ.8 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

లైసెన్స్ లేకుండా ఐస్ క్రీమ్ గోడౌన్ 

కూకట్​పల్లి: లైసెన్స్​ లేకుండా ఐస్​క్రీమ్ గోడౌన్​ను నడుపుతున్న వ్యక్తిని బాలానగర్ ఎస్​వోటీ, కూకట్​పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శంషీగూడలో ఉండే రమేశ్​గౌడ్(40)   పర్మిషన్ లేకుండా ఐస్​క్రీమ్ గోడౌన్​ను నడుపుతున్నాడు. సమాచారం అందుకున్న ఎస్​వోటీ పోలీసులు గోడౌన్​పై దాడులు చేశారు. రమేశ్ సింథటిక్ కలర్లతో ఐస్ క్రీమ్ తయారు చేసి ‘అను ఫ్రొజన్ ఫుడ్’ పేరుతో లేబుల్స్ వేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. గోడౌన్​లో నిల్వ చేసిన రూ.15 లక్షల విలువైన ముడి పదార్థాలు, ఐస్ క్రీమ్​లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలించారు.