సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్‌.. రైల్వే శాఖ కసరత్తు

సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్‌.. రైల్వే శాఖ కసరత్తు

సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారి కోసం రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రధాన మార్గాల్లో స్పెషల్ ట్రైన్ల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. కరోనాతో రెండేళ్లుగా పెద్దగా పండుగను సెలబ్రేట్ చేసుకోనివారు ఈ సారి పల్లెలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. చాలా మంది ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేసేసుకున్నప్పటికీ కొంత మంది ఆఫీసుల్లో సెలవులు ఒకే అయ్యాక చేసుకోవచ్చని చూస్తున్నవాళ్లూ ఉన్నారు. అయితే దాదాపుగా అన్ని రైళ్లలో ఇప్పటికే బెర్తులు ఫుల్ అయ్యాయి. వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉండటంతో ప్రయాణికులు టెన్షన్ పడుతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్ల పొడిగింపు, ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లపై నజర్ పెట్టారు అధికారులు.

ఈసారి సంక్రాంతి పండక్కి ఊర్ల ప్రయాణం ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. కరోనాతో రెండేళ్ల పండగ పెద్దగా సెలబ్రేట్ చేసుకోని జనం.. ఈసారి దూర ప్రయాణం అయినా వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా రైళ్ల ప్రయాణం చేసేవారు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటుండగా, దాదాపు అన్ని రైళ్ల సీట్లూ బుక్ అయ్యాయి. సంక్రాంతికి సిటీ నుంచి ఏపీకి వెళ్లే వాళ్లే ఎక్కువమంది ఉంటారు. దీంతో ఏపీకి వెళ్లే అన్ని రూట్లలోని రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. నెలన్నర ముందే చాలా రైళ్లలో వెయిటింగ్  లిస్ట్  ఉంది. గోదావరి, గౌతమి, గరీబ్  రథ్  వంటి రైళ్లు ఫుల్ అయ్యాయి. ఫలక్ నుమా, ఎల్ టీటీ, కోణార్క్  ఎక్స్ ప్రెస్ లలో పరిమితి దాటి ‘రిగ్రెట్ ’కు చేరింది. ఈసారి సంక్రాంతికి స్వస్థలాలకు బయల్దేరేవారు, జనవరి 9 నుంచే సెలవులు ఉండడంతో  జనవరి 10 నుంచి 12 వరకు టికెట్లకు భారీగా డిమాండ్  ఉంది.

సికింద్రాబాద్  నుంచి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, నరసాపురం వైపు రద్దీ తీవ్రంగా ఉంది. ఖమ్మం, విజయవాడ, రాజమండ్రికి వెళ్లాలనుకునే వారికీ టికెట్లు దొరకట్లేదు. ఒడిశా, బెంగాల్ కు వెళ్లే రైళ్లలో ఇప్పటికే వెయిటింగ్  లిస్ట్  ఉంది. సికింద్రాబాద్ -విశాఖ మార్గంలో 10 రైళ్లుంటే జనవరి 11న 9, 12న అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్  ఉంది. విశాఖ ఎక్స్ ప్రెస్ , గోదావరి ఎక్స్ ప్రెస్ లో వెయిటింగ్  లిస్టు నడుస్తోంది. రెగ్యులర్ రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. మచిలీపట్నం-కర్నూలు, నర్సాపూర్- సికింద్రాబాద్, సికింద్రాబాద్- విజయవాడ, మచిలీపట్నం, తిరుపతి రైళ్లను జనవరి ఫస్ట్ నుంచి పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.  

తెలంగాణాలో రామగుండం, మంచిర్యాల, కాగజ్ నగర్ , నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మిర్యాలగూడ, వరంగల్ వైపు కూడా పండగ సమయంలో రద్దీ ఉంటుంది. ఈ మార్గాల్లో కూడా అదనపు రైళ్లు ఈనెలాఖరుకు ఖరారు చేసే అవకాశం ఉంది.