- దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ వ్యాఖ్య
- 86 మంది ఉద్యోగులకు విశిష్ట్ రైల్ సేవా అవార్డుల అందజేత
- బెస్ట్ పెర్ఫార్మెన్స్ షీల్డ్ గెలుచుకున్న హైదరాబాద్, గుంతకల్లు డివిజన్స్
పద్మారావునగర్, వెలుగు: రైల్వేల అభివృద్ధికి వ్యవస్థాగత సంస్కరణలు, సిబ్బంది నైపుణ్యాల పెంపుదల అత్యంత కీలకమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. ఉద్యోగులే సంస్థ బలమని.. వినియోగదారుల సేవ, భద్రత, నిర్వహణ రంగాల్లో కాలానుగుణ మార్పులతో ముందుకు సాగాలని సూచించారు. గురువారం దక్షిణ మధ్య రైల్వే 70వ రైల్వే వారోత్సవాలను సికింద్రాబాద్‌లోని న్యూ బోయిగూడలో ఉన్న రైల్ కళారంగ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.
ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఉద్యోగులకు సూచించారు. ప్యాసింజర్ల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ రైల్వేలు అభివృద్ధి పథంలో సాగుతున్నాయని వివరించారు.ఈ సందర్భంగా జోన్‌లో ఉత్తమ పనితీరు కనబరిచిన డివిజన్లు, విభాగాలకు ఎఫిషియెన్సీ షీల్డ్‌లు, అధికారులు, సిబ్బందికి విశిష్ట రైల్ సేవా అవార్డులను సంజయ్ అందజేశారు.
ఓవర్ ఆల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్‌ను హైదరాబాద్, గుంతకల్లు డివిజన్లు సంయుక్తంగా సాధించాయి. మొత్తం 35 ఎఫిషియెన్సీ షీల్డ్‌లు, 86 మందికి వ్యక్తిగత అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాశ్, సీనియర్ డిప్యూటీ జీఎం ఆశిష్ మెహ్రోత్రా, డిప్యూటీ జీఎం ఉదయనాథ్ కోట్లా, వివిధ డివిజనల్ రైల్వే మేనేజర్లు, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
