మేడ్చల్, మహబూబ్ నగర్ సెక్షన్ల మధ్య పనులకు..రైల్వే మంత్రిత్వ శాఖ ఓకే

మేడ్చల్, మహబూబ్ నగర్ సెక్షన్ల మధ్య పనులకు..రైల్వే మంత్రిత్వ శాఖ ఓకే

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : మేడ్చల్– -ముద్ఖేడ్, మహబూబ్ నగర్– డోన్ సెక్షన్ల మధ్య ఎలక్ట్రిక్ ట్రాక్ సిస్టమ్ మెరుగుపర్చేందుకు చేసిన ప్రతిపాదనపై కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదించింది. మేడ్చల్ -– ముద్ఖేడ్ ప్రాజెక్టుకు రూ. 193.26 కోట్లు, మహబూబ్ నగర్ –- డోన్ ప్రాజెక్ట్ కు రూ. 122.81 కోట్లు ఖర్చు చేయనుంది. విద్యుత్ ట్రాక్ వ్యవస్థను డెవలప్ చేయడంలో ప్రధానంగా సర్క్యూట్ బ్రేకర్ల మార్పు, స్విచ్చింగ్ స్టేషన్లు, అదనపు కండక్టర్ల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

 రెండు ప్రాజెక్టుల పరిధి తెలంగాణలో ఎక్కువగా, ఏపీ, మహారాష్ట్రలో కొద్దిగా విస్తరించి ఉంది. మేడ్చల్ -– ముద్ఖేడ్ మధ్య 225 కిలోమీటర్లు,  మబూబ్ నగర్ – డోన్ మధ్య 184  కిలోమీటర్ల   దూరం ఉంటుంది. దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను అనుసంధానించే సింగిల్ లైన్ విభాగాలు ఇవి.  రైల్వే మంత్రిత్వ శాఖ 2023 ఆగస్టులో ముద్ఖేడ్– మేడ్చల్, మహబూబ్ నగర్ – డోన్ సెక్షన్ల మధ్య డబ్లింగ్, డోన్ బైపాస్ లైన్ పనులను మంజూరు చేసింది. రెండు ప్రాజెక్టుల మధ్య వ్యవస్థ ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను మరింత సమర్థవంతంగా, సజావుగా నడపడంలో దోహదపడనుంది.