పద్మారావునగర్, వెలుగు: రైల్వే ప్రయాణికుల భద్రతతో పాటు నేరాల నియంత్రణకు జీఆర్పీ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని రైల్వే ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. లాలాగూడలోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జీఆర్పీ వార్షిక సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. రైల్వే పరిధిలో ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందన్నారు.
2024లో 2,835 కేసులు నమోదు కాగా, 2025లో 2,607 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఆర్పీఎఫ్ సహకారంతో నిఘా పెంచి నేరాలను అరికట్టినట్లు చెప్పారు. ప్రాపర్టీ నేరాలు, ఎన్డీపీఎస్ కేసులు, మొబైల్ చోరీలు, కిడ్నాప్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ఎంఎంటీఎస్ ట్రైన్ ఇష్యూ ఫేక్ కంప్లైంట్‌గా తేలిందని, యువతి సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ పడిపోయిందని ఎస్పీ వెల్లడించారు. అలాగే శంకరపల్లి ట్రాక్‌పై కారు నడిపిన మహిళ మెంటల్ డిస్టర్బెన్స్‌తో ఉన్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. రైల్వే ప్రయాణికులకు సమస్యలు ఎదురైతే 139 హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ఎస్.ఎన్. జావెద్ (అర్బన్), శ్రీనివాసరావు (రూరల్), ఇన్స్పెక్టర్లు సాయి ఈశ్వర్ గౌడ్, ఆర్. ఎల్లప్ప, ఖాదర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
మొబైల్ రికవరీ: సికింద్రాబాద్ రైల్వే డిస్ట్రిక్ట్‌లో 2023 నవంబర్ నుంచి ఇప్పటివరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 1,322 మొబైల్ ఫోన్లు గుర్తించి యజమానులకు అప్పగించారు. 2025లోనే 572 ఫోన్లు రికవరీ చేశారు.
ఎన్‌డీపీఎస్ కేసులు: 2025లో 54 కేసులు నమోదు చేసి 70 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.04 కోట్ల విలువైన 817 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రూ.5 కోట్ల విలువైన 2,010 కేజీల గంజాయిని ధ్వంసం చేశారు.
మరణాలు: 2025లో 1,317 మరణాలు నమోదు కాగా, వీరిలో 1,058 మందిని గుర్తించారు. వీరిలో 629 మంది ప్రమాదాల్లో మృతి చెందగా, 529 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
చిల్డ్రన్ రెస్క్యూ: ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా 425 బాలురు, 75 బాలికలు కలిపి 500 మంది పిల్లలను రక్షించి సీడబ్ల్యూసీ కేంద్రాలకు తరలించారు.
ప్రాపర్టీ నేరాలు: 1,034 కేసులు నమోదు కాగా 27.50 శాతం ఛేదించారు. రూ.4.90 కోట్ల నష్టం జరిగినా 9.65 శాతం ఆస్తి రికవరీ చేశారు. సీసీ కెమెరాల్లో ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగంతో నేరస్థులను గుర్తిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
