హైదరాబాద్, వెలుగు: ఫ్రీవైఫై అమలులో సికింద్రాబాద్రైల్వే స్టేషన్ దేశంలోనే ముందుంది. రైల్వేలో వై-ఫై సౌకర్యం ఉన్న 1,600కు పైగా స్టేషన్లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యధిక వినియోగదారులతో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. 2019 మేలో సికింద్రాబాద్ జోన్‌లోని 207 స్టేషన్లలో 40 టెరాబైట్ల డాటాను 10 లక్షలకు పైగా ప్రయాణికులు వాడారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, గుంతకల్లు స్టేషన్లలోనూ అత్యధిక స్థాయిలో వై-ఫైని వాడారు. కాగా, డిజిటల్ ఇండియా ఉద్యమానికి ఊతమిస్తూ రైల్‌టెల్ కార్పొరేషన్ రైల్వే నెట్‌వెర్క్ మొత్తం డిజిటల్ పద్ధతులు అమలు చేయడానికి రైల్వే ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో ఫ్రీ హైస్పీడ్ వై-ఫై సౌకర్యం కల్పిస్తోంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలోని 36 ప్రధాన రైల్వే స్టేషన్లు (ఏ-1, ఏ కేటగిరి), 171 చిన్న స్టేషన్లు (బి, సి, డి, ఇ కేటగిరి) మొత్తం 207 స్టేషన్లలో వై-ఫై సౌకర్యం ఉంది. అన్ని ఏ-1, ఏ, బీ, సీ,డీ కేటగిరీ స్టేషన్లలోనూ, కొన్ని ఇ కేటగిరీ స్టేషన్లలోనూ వై-ఫై సౌకర్యం ఏర్పాటు పూర్తయ్యింది. 76 ఇ -కేటగిరీ స్టేషన్లలో వై-ఫై ఏర్పాటు పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. మిగిలిన 291 ఇ- కేటగిరీ స్టేషన్లలో వై-ఫై పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే లోని అన్ని రైల్వే స్టేషన్లలో (ఎఫ్ -కేటగిరీ స్టేషన్లు మినహాయించి) వై-ఫై సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

