
ఢిల్లీలోని రెండు మసీదులకు రైల్వే శాఖ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో ఆక్రమణలను తొలగించాలని కోరింది. ఉత్తర రైల్వే ఆధీనంలో ఉన్న బెంగాలీ మార్కెట్ మసీదు, బాబర్ షా టకియా మసీదులకు రైల్వే శాఖ నోటీసులు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా ఆక్రమణలను తొలగించకుంటే తమ భూములను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు హెచ్చరించారు.
రైల్వే శాఖ ఆధీనంలో ఉన్న భూమిని ఆక్రమంగా ఆక్రమించి ఆ స్థలాల్లో భవనాలు, దేవాలయాలు, మసీదులు నిర్మించారని వాటిని స్వచ్ఛందంగా తొలగించాలని రైల్వే అధికారులు నోటీసులు పేర్కొన్నారు. నోటీసును పాటించడంలో విఫలమైతే రైల్వే చట్టం ప్రకారం రైల్వే యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. తద్వారా జరిగే నష్టాలకు వారే బాధ్యత వహించాలని తెలిపింది. రైల్వే శాఖ నుంచి ఎటువంటి పరిహారం ఉండదని నోటీసులో తెలిపింది. అయితే రైల్వే అధికారులు తమ భూమిలో అనుమతి లేకుండానే కట్టడాలు నిర్మించారని చెబుతుండగా.. ఈ మసీదులు 400 ఏళ్ల నాటివని.. ప్రార్థనా స్థలాలు గణనీయమైన చారిత్రక విలువను కలిగి ఉన్నాయని చెబుతున్నారు.