
హైదరాబాద్: భాగ్యనగరంపై భారీ వర్షాలు పగబట్టినట్టు తయారైంది పరిస్థితి. మరో గంట నుంచి రెండు గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యవసరం అయితే తప్ప నగరవాసులు ఇళ్ల నుంచి బయట అడుగుపెట్టొద్దని సూచించింది. ఆఫీస్లకు వెళ్లిన వాళ్లు, వ్యాపారాలు చేసుకునేటోళ్లు త్వరగా ఇండ్లకు చేరుకోవడం మేలు. లేకపోతే.. వర్షం కారణంగా గంటల కొద్దీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
హైదరాబాద్లో ఇవాళ (20-.08.2024) కూడా భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కళాసి గూడ, ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్, స్టేషన్ రోడ్డు, మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, రాణిగంజ్ తోపాటు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దుండిగల్,గండి మైసమ్మ,షాపూర్ నగర్,సుచిత్ర,పెట్ బషీరాబాద్,గుండ్ల పోచంపల్లి,జీడిమెట్ల,సూరారంలో వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా కండ్లకోయ నుంచి సుచిత్ర వెళ్ళే 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. వర్షం కారణంగా రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థ పడ్డారు.
సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద ఉధృతికి ముషీరాబాద్ రాంనగర్ కాలువలోకి శవం కొట్టుకొచ్చింది. ముషీరాబాద్ వినోబా నగర్ ప్రేయర్ పవర్ చర్చ్ దగ్గర నివాసం ఉండే అరుణ్ కుమార్ (43) గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న వారాసిగూడ పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అరుణ్ కుమార్ మృత దేహాన్ని అప్పగించారు.