
హైదరాబాద్: జార్ఖండ్ పరిసర ప్రాంతాలలో ఆవర్తనం కొనసాగుతుంది. ఆవర్తనం కారణంగా తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు(21-.08.2024) రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గాలి వేగం గంటకు 30- నుంచి 40 కి. మీల ఉండొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక.. హైదరాబాద్ నగరంలో కూడా ఇవాళ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శేరిలింగంపల్లి, చందానగర్, కూకట్పల్లి ప్రాంతాల్లో మరికొన్ని గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.