తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

 తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు 8, 9న  భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఆగస్టు 8న  తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.  నల్గొండ, మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.   ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి. మీ)తో కూడిన వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాలలో కురిసే అవకాశం ఉందని వెల్లడించింది

ఆగస్టు 9 నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ  భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణలోని  అన్ని జిల్లాలలో కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

హైదరాబాద్ లో కుండపోత

ఇప్పటికే హైదరాబాద్ లో తో పాటు   తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 7న రాత్రి రెండున్నర గంటలు పాటు నాన్ స్టాప్ గా వర్షం పడింది.  హైదరాబాద్ లో   కుండపోత వర్షం పడింది. ఆకాశానికి గండి పడిందా అన్నట్టుగా గ్రేటర్ వ్యాప్తంగా ఏకధాటిగా వర్షం దంచికొట్టింది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 13.7 సెంటీమీటర్ల వాన పడింది. దారులన్నీ ఏరులై పారడంతో ట్రాఫిక్ జామ్​లతో వాహనదారులు నరకం చూశారు. పలు చోట్ల బండ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద చేరింది. సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్​లోని కేశవ్ నగర్​లో రెండు చెట్లు రోడ్డుపై కూలడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మణికొండలో ఓ కారుపై ప్రహారీ కూలింది. వర్షం కారణంగా మెట్రో స్టేషన్లలో రద్దీ నెలకొంది.