మరో నాలుగు రోజుల పాటు వానలు.. ఈ జిల్లాల్లో అధిక వర్షాలు పడే ఛాన్స్

మరో నాలుగు రోజుల పాటు వానలు.. ఈ జిల్లాల్లో అధిక వర్షాలు పడే ఛాన్స్

హైదరాబాద్‌ మే 10వ తేదీ  బుధవారం వర్షం బీభత్సం సృష్టించింది.  పొద్దున నుంచి వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం  హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌ నగర్‌, ఘట్‌ కేసర్‌, ఫిర్జాదిగూడ, హయత్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వాన దంచికొట్టింది. రంగారెడ్డి శంషాబాద్ సహా ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వాన పడింది. ఈ  వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

బీఎండబ్ల్యూ కారు ధ్వంసం

భారీ వర్షానికి హైదరాబాద్ కంచన్ బాగ్ DRDO- బాలాపూర్ రోడ్ లో చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆ రూట్ లో వెళ్లే వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు మాదన్న పేటలో  ఓ ఇంటి ముందు పార్క్ చేసిన BMW కార్ పై కరెంట్ పోల్  విరిగిపడింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయింది. కరెంట్ పోల్ వైర్ల పై భారీ వృక్షం కూలి పడడంతో ఈ  ఘటన జరిగింది.

వెదర్ అలర్ట్..

రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మే 11, 12వ తేదీల్లో వడగండ్లతో కూడిన వానలు పడతాయిని పేర్కొంది. మే 10వ తేదీన  దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో..మే 11వ తేదీన  ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి, కింది స్థాయి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.  రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.