
వానా కాలంలో వానలు, ఎండా కాలంలో ఎండలు మామూలే కానీ..ఒక్కోసారి ఈ వానలు రమన్నా రావు గానీ ఇప్పుడు కాలం కానీ కాలంల వర్షాలు పడి జనాన్ని పరేషాన్ చేస్తున్నాయి. ఓ వైపు ఎండలతో తలకాయలు పగులుతుంటే .. ఇంకో వైపు వానలు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. అరే ..ఎండ వేడికి వానలు పడితే ఏమవుతుందనుకోవచ్చు గానీ ఊళ్లల్లో పంటలు వేసిన రైతులు నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు. చేతికొచ్చిన పంటలు నాశనం అవుతున్నాయని లబోదిబోమంటున్నారు.
మొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన వడగండ్ల వానకు పంటలు నష్టపోయి రైతులు లబోదిబోమన్నారు. వందల ఎకరాల్లో మామిడి, బొప్పాయి. అరటి, వరి పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటలన్నీ నాశనం అయ్యాయి. రైతన్నలు గగ్గోలు పెట్టారు. మళ్లీ ఇంతలోనే కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ లో కూడా ఒక్కటే తీరుగా వర్షాలు పడుతున్నాయి. రైతులు ఆగమాగమవుతున్నారు. నడీ ఎండకాలంలో ఈ వానలేందో ఏమో.. ఈ వానలు రమ్మన్నప్పుడు రావు, వద్దన్నప్పుడు ఆగవు.