న్యూఢిల్లీ: ఉత్తరాదిలో భిన్నమైన వాతవరణం నెలకొన్నది. ఢిల్లీలో వాన పడ్తుంటే.. జమ్మూలో మంచు కురుస్తున్నది. అటు హిమాచల్‌ప్రదేశ్‌ను కూడా మంచు దుప్పటి కప్పేసింది. శుక్రవారం (జనవరి 24) ఉదయం ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.
చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానపడింది. దీనికితోడు బలమైన ఈదురుగాలులు ఢిల్లీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకట్రెండు రోజులు ఇలాంటి వెదరే ఉంటుందని
వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అటు జమ్మూ కాశ్మీర్‌లోని చాలా ప్రాంతాలను మంచు కప్పేసింది. బలమైన గాలులతో ఉక్కిరిబిక్కిరిఢిల్లీలోని నరేలా, రోహిణి, ద్వారక, వెస్ట్ విహార్ తో పాటు అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఈ వర్షం.. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్‌ను తగ్గించినప్పటికీ చలి తీవ్రత చాలా పెరిగింది. ఈ నేపథ్యంలో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. బవానా, అలిపూర్, బురారి, కాంఝావాలా, బద్లి, మోడల్ టౌన్, ఆజాద్‌పూర్, పితంపూర, ముండ్కా, పంజాబీ బాగ్, రాజౌరీ గార్డెన్, జాఫర్పూర్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం రికార్డయింది. ఒకట్రెండు రోజుల్లో ఈ రీజియన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పంజాబ్, హర్యానాలో భారీ వర్షం
పంజాబ్, హర్యానాలోనూ భారీ వర్షం కురిసింది. ఈ వాన రైతులకు ఆనందాన్ని కలిగించగా, కొన్ని ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. చండీగఢ్‌లోని మణిమజ్రాలో భారీ వర్షం కారణంగా ఇంటి పైకప్పు కూలి ముగ్గురు బాలురు గాయపడ్డారు. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. మరో ఘటనలో 2 కార్లు, కరెంట్ పోల్స్ దెబ్బతిన్నాయి. చండీగఢ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ఫాల్స్ సీలింగ్ కూలిపోయింది. పంజాబ్‌లోని అమృత్‌సర్, లూధియానా, పటియాలా, పఠాన్‌కోట్, బటిండా, హర్యానాలోని అంబాలా, హిసార్, కర్నాల్, రోహ్తక్, సోనిపట్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
జమ్మూ కాశ్మీర్లో దట్టమైన మంచు వర్షం
కాశ్మీర్‌తో పాటు అనేక ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తున్నది. దీంతో చాలా టూరిస్ట్ స్పాట్లు స్నోఫాల్‌తో ఆకట్టుకుంటున్నాయి. మాతా వైష్ణో దేవి క్షేత్రంలో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో రవాణా, విమాన, రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భైరవ ఆలయ పరిసరాలన్నీ మంచుతో నిండిపోయాయి. ముందు జాగ్రత్తగా తారాకోట్, బాణగంగ మార్గాల్లో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. పూంచ్ జిల్లాలో చిక్కుకుపోయిన సుమారు 100 మందిని, ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్‌లో 12 మందిని పోలీసులు రక్షించారు.
జమ్మూ– శ్రీనగర్ జాతీయ రహదారిపై నవ్యుగ్ టన్నెల్ సమీపంలో మంచు పేరుకుపోవడంతో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మొఘల్ రోడ్, శ్రీనగర్ – లేహ్ రహదారులను మూసేశారు. మంచు కురుస్తున్న నేపథ్యంలో రాజౌరీ, పూంచ్, కథువా జిల్లాల్లోని అన్ని స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ లోని 6 జిల్లాలకు అధికారులు అత్యంత ప్రమాదకరమైన మంచు తుఫాను హెచ్చరికను జారీ చేశారు. హిమాచల్‌లోనూ భారీగా మంచు కురుస్తున్నది. జనజీవనం సాధారణ స్థితికి వచ్చేలా చూడాలని, అత్యవసర సేవలను పునరుద్ధరించాలని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు అధికారులను ఆదేశించారు.
