
ఎండాకాలంలో వాన కురిసింది. నిన్న(ఆదివారం) రాత్రి హైదరాబాద్ లో అకాల వర్షం కురిసింది. నగరవాసులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించినా.. ఉరుములు, మెరుపులు భయపెట్టించాయి. ఎల్బీనగర్, సనత్ నగర్, నాంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు ఏరులై పారింది. అయితే ఆదివారం రాత్రి కావడంతో రోడ్లపై ఎక్కువ జనాలు లేకపోవడంతో ట్రాఫిక్ చిక్కులు తప్పినట్లైంది. పగలంతా ఎండ దంచికొట్టింది. రాత్రి సమయంలో ఆకస్మాత్తుగా వర్షం ప్రత్యక్షమైంది. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లగాలులు వీచాయి. ఎండ వేడిమి నుంచి కాసింత రిలాక్స్ దొరికినట్లైంది.
వర్షానికి కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా.. అధికారులు వెంటనే స్పందించి పునరుద్ధరించారు.